ఈనాడు.. తెలుగునాట అగ్రశ్రేణి దినపత్రిక.. కొన్ని రోజులుగా ఈనాడు అమరావతి నుంచి రాజధాని మార్పుతో పాటు మండలి రద్దు పరిణామాలపై వరుస కథనాలు ప్రచురిస్తోంది. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలకు వైసీపీ మంత్రులు వల వేస్తున్నారంటూ .. ఆపరేషన్ ఆకర్ష పేరుతో ఇటీవల బ్యానర్ వార్త వేసింది. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు కూడా. అది అలా ఉంచితే.. ఈనాడు సోమవారం సంచికలో మండలిని పునప్రారంభిస్తూ వైఎస్ చెప్పిన మాటలతో ఓ ప్రత్యేక కథనం వేసింది.

 

ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో రద్దయిన శాసన మండలిని మళ్లీ 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించాడు. ఆ సమయంలో ఆయన మండలి ఆవశ్యకత గురించి ప్రారంభోపన్యాసం చేశారు. అప్పటి ఈనాడు కథనాన్ని కోట్ చేస్తూ సోమవారం ప్రత్యేక కథనం ప్రచురించింది ఈనాడు. చూశారా తండ్రి మండలికి ప్రాణం పోస్తే.. ఆయన వారసత్వం గురించి పదే పదే చెప్పుకునే ఆయన తనయుడు జగన్ దాని ప్రాణం తీస్తున్నాడని జనం అనుకోవాలన్నది ఈనాడు ఉద్దేశ్యం కావచ్చు.

 

అయితే ఈ కథనం సహజంగానే వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది. వైఎస్ పేరుతో తమను ఇరుకున పెట్టాలని చూస్తున్నారని ఆ పార్టీ నేతలు భావించారు. ఇదే క్రమంలో వారు చంద్రబాబు గతం తవ్వారు. అప్పట్లో మండలి పునరుద్ధరణ కోసం ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సమయంలో దాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం ఈ తవ్వకాల్లో బయటపడింది. వైఎస్ శాసన మండలి పెడదామని ప్రతిపాదిస్తే.. ఠాఠ్.. అదో శుద్ధదండుగ అంటూ సాక్షాత్తూ అసెంబ్లీలోనే చంద్రబాబు ఘాటుగా స్పందించారు.

 

అవన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. దీంతో ఆ రికార్డులను తవ్వి తీసిన వైసీపీ వర్గాలు.. దాన్ని సాక్షాత్తూ అసెంబ్లీలోనే ప్రదర్శించే పనికి పూనుకున్నాయి. దాంతో నిండు అసెంబ్లీలో మండలి ఎంత అనర్థాదయకమో.. అనవసర ఖర్చో.. చంద్రబాబు వివరిస్తుటే.. ఆ వీడియోను టీవీ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాల్లో చూసి.. జనం అవాక్కయ్యారు. చంద్రబాబు మాట మార్చిన తీరు చూసి ఛీఛీ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: