చంద్రబాబు తనయుడు .. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తావన లేకుండా ఏపీ రాజకీయాలు నడవడం లేదు. ప్రతి సందర్భంలోనూ లోకేష్ ప్రస్తావన తీసుకు వస్తూ అందరూ ఆయన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. తాజాగా శాసన మండలిని రద్దు చేసిన వ్యవహారంలోనూ లోకేష్ ప్రస్తావన తెరమీదకు తీసుకొచ్చారు వైసీపీ నేత, సత్తెనపల్లి వైసీపీ ఎమ్యెల్యే అంబటి రాంబాబు. ఈ వ్యవహారంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. మండలి రద్దు చేయాలనే ఆలోచన ముందుగా ప్రభుత్వానికి లేదని, కానీ అటువంటి పరిస్థితులను టిడిపి కల్పించిందని ఆయన చెప్పారు.


 రాష్ట్ర అభివృద్ధి కోసం వేగంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, కానీ ప్రతిపక్షం దానిని అడ్డుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. అధికార వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో రాజకీయ దురుద్దేశంతో టిడిపి దానిని సెలెక్ట్ కమిటీకి వెళ్లేలా చైర్మన్ ప్రభావితం చేసిందని అంబటి విమర్శించారు. ఈ వ్యవహారాలన్నీ విసుగెత్తిపోయి శాసనమండలిని రద్దు చేయాలనే భావనకు జగన్ వచ్చారని ఆయన అన్నారు. చట్టాలను త్వరితగతిన అమలు చేసి ప్రజలకు అందించాలి అంటే మండలి అడ్డుగోడగా నిలుస్తోందన్నారు. మెజార్టీ ప్రజల అభిప్రాయం, అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అందుకే గత ఐదేళ్లుగా పరిపాలించిన చంద్రబాబు పార్టీకి ఎప్పుడూ కనివినీ ఎరగని ఓటమిని అందించారని ఆయన ఎద్దేవా చేశారు.


రాజకీయంగా ఆలు కూడా రాని లోకేష్ వంటి వ్యక్తులు శాసనమండలిని భ్రష్టు పట్టించారని , ఇటువంటి వారు మండలిలో ఉండడం సిగ్గుచేటని అన్నారు. అసలు లోకేష్ కు రాజకీయ పరిజ్ఞానమే లేదని అయినా ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్ధేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అయినా బాబు ఆశ తీరడంలేదన్నారు. మండలిని దుర్వినియోగం చేసినందుకు చంద్రబాబు బాధ్యత వహించాలని అంబటి విమర్శించారు. లోకేష్ వంటి వారు మండలిలో ఉండడం వల్లే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: