కోడెల శివప్రసాదరావు.. మాజీ స్పీకర్.. ఇటీవలే కన్నుమూశారు. మన సంస్కృతిలో పోయినోళ్లందరూ మంచివాళ్లే అనుకుంటాం. వాళ్లు ఎంత చెడ్డవారైనా.. చనిపోయిన తర్వాత వారిపై పెద్దగా విమర్శలు చేయం.. కానీ వైసీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం బతికి ఉండగా కోడెల చేసిన అరాచకాలను ఇంకా మరచిపోలేకపోతున్నారు. అసెంబ్లీలో మరోసారి కోడెల ప్రస్తావన తెచ్చారు రోజా.

 

చంద్రబాబు గతంలో చేసిన అరాచకాలను ప్రస్తావించిన రోజా.. అదే సమయలో కోడెల తీరునూ గుర్తు చేశారు.. ఆమె ఏమన్నారంటే.. “ చంద్రబాబు తనకు రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్ కు మైకు కూడా ఇవ్వకుండా, ఆయన అధికారాన్ని లాగేసి ఆయనను క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమయ్యారు. మహిళా డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మగారిని దారుణంగా విమర్శించి, ఆమె కన్నీళ్లుపెట్టుకునే పరిస్థితిని తెచ్చారు.. అన్నారు.

 

మొన్నటి వరకూ స్పీకర్ స్థానంలో కూర్చొన్న వ్యక్తి రాజ్యాంగాన్ని, అసెంబ్లీని దిగజార్చేలా పూనుకున్నారని కోడెల తీరును గుర్తు చేశారు రోజా. చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని, వారిలో 4ని మంత్రులను చేసాడు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏగడ్డైనా కరవడానికి వెనుకాడడని స్పష్టంగా తెలుస్తోంది. పొలిటికల్ క్రిమినల్ ఎవరంటే ఎవ్వరైనా సరే చంద్రబాబు పేరు చెబుతారు. శాసన మండలి రద్దుపై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ గారిని అన్ని ప్రాంతాల ప్రజలు ఆశీర్వదిస్తున్నారు..అంటూ ప్రసంగించారు రోజా.

 

" పెద్దల సభ సలహాలిచ్చే వేదిక కావాలే తప్ప సంఘర్షణల వేదికగా మారకూడదు. పెద్దల సభ అంటే ప్రజాతీర్పును గౌరవించాలే కానీ దాన్ని అపహాస్యం చేసేలా ఉండకూడదు. గతంలొ ఎన్టీఆర్ 1985లో శాసన మండలిని రద్దు చేసారు. తనను అవమానించారనే కారణంతోనే ఆ పని చేసారు. కానీ మా ముఖ్యమంత్రి 7 నెలల్లో ఎప్పుడూ ఆ ఆలోచన చేయలేదు. ఆయన ఆలోచనంతా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎలా నడిపించాలి, ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాలి అని మాత్రమేనన్నారు రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: