ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి సీఎం జగన్ ప్రజా సంక్షేమ పాలనను అందిస్తూ కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినేట్ భేటీలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం, గురజాల, అరకు కేంద్రంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరగనుందని సమాచారం. 
 
అయితే ఈ అంశం గురించి ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడలేదు. ఏపీ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం అరకు, గురజాల, మచిలీపట్నంలకు వైద్య కళాశాలలను మంజూరు చేసింది. సాధారణంగా ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలంటే 500 కోట్ల రూపాయల నుండి 600 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఎలాంటి వైద్య కళాశాలలు లేని, వైద్య వసతులు తక్కువగా ఉండే వెనుకబడి ఉన్న జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే భారత వైద్య మండలి అందుకయ్యే వ్యయంలో 60 శాతం వరకు భరిస్తుంది. 
 
అందువలన ప్రభుత్వం తొలి దశలో భాగంగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను దశల వారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నిన్న జరిగిన కేబినేట్ భేటీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన స్థలం కేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఎన్నికల ముందు సీఎం జగన్ అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సీఎం జగన్ దశల వారీగా జిల్లాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీ నెరవేర్చినట్లయింది. ప్రభుత్వం అధికారికంగా మూడు జిల్లాల ఏర్పాటు గురించి ప్రకటన చేయాల్సి ఉంది. ఎంసీఐ సాయం కోసమే మూడు జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: