చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోన్న విషయం తెలిసిందే. దాదాపు 2800 మందికి చైనాలో ఈ వైరస్ సోకగా వీరిలో 80 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ బారిన పడితే వారిలో జ్వరం, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, జలుబు, దగ్గు, గొంతునొప్పి మొదలైన లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధికి మందులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు వ్యాధి తీవ్రతను తగ్గించటానికి మాత్రమే మందులు ఇస్తున్నారు. 
 
వియత్నాం, ఫ్రాన్స్, మలేషియా, సింగపూర్, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, థాయ్ లాండ్, అమెరికాలలో కరోనా కేసులు నమోదు కాగా భారత్ లో ఇప్పటివరకు పాజిటివ్ కేసులేమీ నమోదు కాలేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. 
 
తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు చేతి రుమాలు లేదా టవల్ ను నోటికి, ముక్కుకు అడ్డం పెట్టుకోవాలి లేదా మాస్క్ ను కట్టుకోవాలి. దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర సమస్యలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం మంచిది. పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
 
శీతల ప్రదేశాలకు దూరంగా ఉండటంతో పాటు సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది. పిల్లలు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జనసమూహం ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకపోవడమే మంచిది. తరచుగా చేతులను శుభ్రపరచుకోవాలి. ఇతరులకు, అపరిచితులకు దూరంగా ఉండాలి. బాగా ఉడికిన మాంసం మరియు గుడ్లనే తినాలి. జలుబు, దగ్గు లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే వారికి దూరంగా ఉండటం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. 

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: