ఈయనగారు అసెంబ్లీ సమావేశాల వరకూ వైసిపి ఎంఎల్ఏనే అనటంలో ఎవరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. రాపాక వరప్రసాద్ గెలవటం జనసేన తరపునే గెలిచినా వ్యవహారాలన్నీ వైసిపికి అనుకూలంగానే ఉంటున్నాయి. చివరకు తన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశించినా లెక్క చేయకుండా  అసెంబ్లీలో అవసరమైనపుడల్లా అధికారపార్టీకి మద్దతుగానే నిలబడుతున్నారు. తాజాగా  శాసనమండలి రద్దు విషయంలో కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయటమే దీనికి నిదర్శనం.

 

నిజానికి శాసనమండలి రద్దు విషయంలో పవన్ ప్రత్యేకంగా తన అభిప్రాయాన్ని బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. కాకపోతే రద్దును చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు వ్యతిరేకించారు కాబట్టి అందులోను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించటమంటే పవన్ గుడ్డిగా అనుసరించేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ విషయంలో సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ తర్వాత ఓటింగ్ లో రాపాక ప్రభుత్వానికి మద్దతుగానే మాట్లాడి ఓటేశారు.

 

మూడు రాజధానుల విషయం తీసుకున్నా పవన్ ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అందరూ చూస్తున్నదే. ఒకవైపు పవన్ అర్ధంలేని ప్రకటనలతో చేష్టలతో జగన్ ప్రయత్నాలు అడ్డుకుంటున్నారు. అదే సమయంలో అసెంబ్లీలోపల బయటకూడా రాపాక మాత్రం వైసిపికి మద్దతుగానే మాట్లాడుతున్నారు. ఇతంతా లోపాయికారీగా చేయటం లేదు రాపాక. చేసేవన్నీ బహిరంగంగానే చేసేస్తున్నారు. తమ అధినేత జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినంత మాత్రాన తాను కూడా అదే దారిలో నడవాలని ఏమీ లేదనే లాజిక్ కూడా వినిపిస్తున్నారు. పైగా మూడు రాజధానులను వ్యతిరేకించమని స్వయంగా పవన్ లేఖ రాసినా రాపాక లెక్కే చేయలేదు.

 

అంతకుముందు ఇంగ్లీషు మీడియం ఏర్పాటును కూడా పవన్ తీవ్రంగా వ్యతరేకిస్తే రాపాక అదేస్ధాయిలో మద్దతు పలికారు.  సరే ఈ విషయం ఆ విషయం అని కాదులేండి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పవన్ సిఎంను వ్యతిరేకిస్తుంటే రాపాక మాత్రం జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు.  పుట్టినరోజు నాడు జగన్ ఫొటోలకు పాలాభిషేకాలు చేయటం, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమీషన్లు వేసినపుడు కూడా జగన్ ఫొటోకు పాలాభిషేకాలు చేశారు. చూస్తుంటే రాపాక అసలు జనసేన ఎంఎల్ఏనా లేకపోతే వైసిపి సభ్యుడా అనే సందేహం వచ్చేస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: