హైద‌రాబాద్ వేదిక‌గా మ‌రో ఆధ్యాత్మిక‌ కేంద్రం భ‌క్తుల‌ను అల‌రించ‌నుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌ గ్లోబల్‌ గైడ్‌ దాజీలు కన్హాశాంతివనాన్ని నేడు ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలో 30 ఎకరాల్లో కన్హా శాంతివనం రూపుదిద్దుకుంది. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ గ్లోబల్‌హెడ్‌ క్వార్టర్స్‌గా భావిస్తున్న ఈ శాంతివనం ప్రారంభోత్సవం సందర్భంగా  ఒకేసారి 40వేల మంది ధ్యానం చేయనున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ మొదటి మార్గ‌ద‌ర్శ‌కులు లాల్జీకి ఈ ధ్యానకేంద్రాన్ని అంకితమివ్వనున్నారు.  తాబేలు ఆకారంలో నిర్మించిన ఈ ధ్యానకేంద్రాన్ని హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ 75వ వార్షికోత్సవంలో భాగంగా నిర్మించారు. 

 


ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే  ముంబైలో 2వేల మందికి సరిపోయే ధ్యానకేంద్రముండగా, హైదరాబాద్‌లో నిర్మితమైన ధ్యానకేంద్రంలో ఒకేసారి లక్ష మంది ధ్యానం చేసుకోవచ్చు. మొత్తం 1400 ఎకరాల్లో హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ ఏర్పాటుకాగా, 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ఒక సెంట్రల్‌హాల్‌, 8 సెకండరీహాల్స్‌ చొప్పున మొత్తం 9 హాల్స్‌ను నిర్మించారు. ఈ ధ్యానకేంద్రం రాత్రిపూట కాంతుల్లో తళుకుమనుతు సిడ్నీహార్బర్‌లా కనిపిస్తుంది. 40 వేల మందికి అతిథ్యమిచ్చే క్యాంపస్‌లో, రోజుకు లక్ష మం దికి భోజనాలు పెట్టే వంటగదులు, 350 పడకల సామర్థ్యం గల ఆయుష్‌ దవాఖాన, 6 లక్షల మొక్కలతో కూడిన నర్సరీలు ఇదే ప్రాంగణంలో ఉన్నాయి. 

 

కాగా, కన్హా శాంతివనం ప్రారంభోత్సవం సందర్భంగా మూడు రోజుల చొప్పున మూడు విడుతల్లో పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. జనవరి 28 -30 వరకు, ఫిబ్రవరి 2-4 వరకు, ఫిబ్రవరి 7-9 వరకు మూడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో సుమారుగా 1.2 లక్షల మంది పాల్గొంటారని హార్ట్‌ఫుల్‌నెస్‌ గైడ్‌ దాజీ తెలిపారు. జనవరి 28న ధ్యానకేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత, 29న బాబా రాందేవ్‌ ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల గవర్నర్లు సైతం పాల్గొంటారని దాజీ వెల్లడించారు. ఇక  ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌, ఫిబ్రవరి 7న సామాజిక కార్యకర్త  అన్నాహజారే సైతం పాల్గొని 75వ వార్షికోత్సవానికి హాజరైన వారిని ఉద్ధేశించి ప్రసంగిస్తారన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: