అధికారంలో ఉన్నప్పుడూ ఏ సీనియర్ నేత అయిన మంచి మంచి పదవులు ఆశించడం సహజం. అలా అని సీనియర్ల అందరికి పదవులు దక్కడం కూడా కష్టమే. అలాగే పదవి దక్కకపోతే ఆ నేతలు కాస్త అసంతృప్తిగా ఉండటం కూడా సహజమే. అయితే ఎంత అసంతృప్తి ఉన్న కొందరు దాన్ని పైకి కనపడనివ్వకుండా పార్టీ కోసం పని చేస్తారు. ఆ విధంగా పదవి రాకపోయిన...పార్టీ కోసం నిలబడే నేతల్లో కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ముందు వరుసలోనే ఉంటారనే చెప్పొచ్చు.

 

కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన సారథి 2004లో వుయ్యూరు(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన పెనములూరు నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత వైఎస్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఆ ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో పెనమలూరు నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 

ఇంత సీనియారిటీ ఉండటంతో మంత్రి పదవి దక్కుతుందని సారథి భావించారు. కానీ సామాజికవర్గాల సమీకరణల్లో భాగంగా సారథికి పదవి దక్కలేదు. దీంతో మంత్రి పదవి దక్కనందుకు సారథి కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. అయితే జగన్ రూల్ ప్రకారం రెండున్నరేళ్ళలో మళ్ళీ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది కాబట్టి....లోపల అసంతృప్తిని పైకి కనిపించకుండా చూస్తూ....తన పని తాను చేసుకెళుతున్నారు. ఇక ఈ 8 నెలల కాలంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు.

 

అలాగే ప్రభుత్వం నుంచే వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని తన నియోజకవర్గ ప్రజలకు అందించడంలో ముందున్నారు. అటు అసెంబ్లీ, ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లు ఇలా దేనిలోనైనా ప్రతిపక్ష టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో సారథి దూకుడు ప్రదర్శిస్తున్నారు.  అయితే ఈ 8 నెలల కాలంలో పెనమలూరులో అనుకున్న అభివృద్ధి జరగలేదు. 8 నెలలు తక్కువ సమయమే కాబట్టి ఆ విషయాన్ని వదిలేస్తే...పెనమలూరు...రాజధాని అమరావతికి దగ్గర ప్రాంతం కాబట్టి, కాస్త మూడు రాజధానులుపైన ప్రజలు అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. పైగా సారథి కూడా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో...ఆయనపైన ప్రజల్లో కాస్త నెగిటివ్ ఉంది. కాకపోతే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో అంతా నార్మల్ అయ్యే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: