మాటలు తక్కువ మేటర్ ఎక్కువ...ఈ మాట నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు బాగా సెట్ అవుతుందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మేకా ప్రతాప్‌కు...మొదట నుంచి వివాదరహితుడిగానే పేరుంది. ఆయన పని ఆయన సైలెంట్ చేసుకుని వెళ్లిపోవడం తప్ప అనవసరపు విషయాలు జోలికి వెళ్లారు. ఇక దివంగత వైఎస్సార్ అండతో మేకా ప్రతాప్ మొదటిసారి 2004లో నూజివీడు నుంచి పోటీ చేసి దాదాపు 20 వేల మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేసుకున్నారు.

 

అయితే మంచి ఎమ్మెల్యేగానే పేరు తెచ్చుకున్న మేకా 2009లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ వేరే పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ వదిలేసి అటు వెళ్ళిపోయి...2014లో వైసీపీ తరుపున విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి మరోసారి వైసీపీ బరిలో దిగి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎలాగో వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో మేకాకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ ఆయనకు అలాంటి పదవి ఏమి దక్కలేదు. పదవి దక్కలేదని అసంతృప్తి ఏమి పెట్టుకోకుండా ఎప్పుడు లాగానే నియోజకవర్గంలో సైలెంట్‌గా పని చేసుకుంటున్నారు.

 

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ...వారి సమస్యలని పరిష్కరిస్తూ ముందుకెళుతున్నారు. అలాగే ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నారు. అయితే ఇంత చేస్తున్న నూజివీడు నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి పథంలో వెళ్లిందనే దాఖలాలు లేవు. గత ఐదేళ్లు మేకా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటం వల్ల, నిధులు పెద్దగా రాలేదు. ఇక ఇప్పుడు తమ ప్రభుత్వం రావడంతో రానున్న రోజుల్లో నూజివీడులో మంచి మార్పు తీసుకొచ్చే అవకాశముంది.

 

బేసిక్‌గా మేకా మృదుస్వభావి కావడం వల్ల ప్రతిపక్ష టీడీపీ మీద పెద్ద విరుచుకుపడిన సందర్భాలు లేవు. అలాగే అసెంబ్లీలో కూడా పెద్దగా హైలైట్ కాలేదు. కాకపోతే సైలెంట్‌గానే టీడీపీకి చెక్ పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. విషయ పరిజ్ఞానంతో బాగా మాట్లాడగలరు. కాబట్టి ఓ రకంగా ఆయన్ని సైలెంట్ సెన్సేషన్ అనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: