తెలంగాణలోని మున్సిపాలిటీల్లో మేయర్ల ఎన్నిక తంతు ముగిసింది. మొత్తం 9 కార్పోరేషనల్లకు ఎన్నికలు జరుగగా.. ఇప్పటి వరకు 8 మున్సిపల్‌ కార్పోరేషన్లకు ఎన్నికైన మేయర్ల వివరాలు వెల్లడయ్యాయి. నిజాంపేట మేయర్‌గా కొలన్ నీలారెడ్డి, డిప్యూటీ మేయర్‌గా ధనరాజ్‌ యాదవ్‌, బోడుప్పల్ మేయర్‌గా సామల బుచ్చిరెడ్డి, జవహార్‌నగర్ మేయర్‌గా మేకల కావ్య, బడంగ్‌పేట్‌ మేయర్‌గా చిగురింత పారిజాత, బండ్లగూడ జాగీర్‌ మేయర్‌గా మహేందర్ గౌడ్, పీర్జాదీగూడ మేయర్‌గా జక్కా వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌ మేయర్‌గా దండు నీతూకిరణ్, రామగుండం మేయర్‌గా బంగి అనిల్ కుమార్, మీర్‌పేట్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ముడావత్ దుర్గ, డిప్యూటీ మేయర్‌గా తీగల విక్రమ్ రెడ్డి ఎన్నికయ్యారు.

 

అయితే వీరంద‌రిలోనూ జవహార్‌నగర్ మేయర్‌గా మేకల అయ్యప్ప కూతురు మేకల కావ్య కొత్త రికార్డు క్రియేట్ చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో 26 ఏళ్ల ప్రాయంలోనే కార్పొరేషన్‌ తొలి మేయర్‌గా ఎన్నికై మేకల కావ్య రికార్డు సృష్టించారు. కావ్య మారేడ్‌పల్లి నారాయణ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఈసీఐఎల్‌ నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివారు. శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాలలో 2016లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కోర్సు పూర్తి చేశారు. 2017 మార్చి 16న ప్రవీణ్‌ను వివాహం చేసుకున్నారు. రెండేళ్ల కుమార్తె ధాన్వితో కలిసి కార్పొరేషన్‌ పరిధిలోని 15వ డివిజన్‌లో నివసిస్తున్నారు. కావ్య భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ప‌ని చేస్తున్నారు.

 

అయితే తొలి మేయర్‌ పదవికోసం ఎందరో పోటీపడ్డారు. రిజర్వేషన్‌ అనుకూలించక పోవడంతో చాలామంది పోటీనుంచి తప్పుకున్నారు. ఎన్నికల్లో 28 డివిజన్‌లకు గాను 20 డివిజన్‌లను టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకొని మేయర్‌ స్థానాన్ని నిలబెట్టుకొంది. అయితే మేయర్‌ పదవి కోసం ఇరువురు పోటీపడుతున్నారు. వీరిలో 15వ డివిజన్‌ నుంచి పోటీచేసిన మేకల కావ్య కార్పొరేషన్‌లోనే 900 పైచిలుకు ఓట్లతో అత్యధిక మెజార్టీ సాధించారు. మంత్రి మల్లారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు మేకల అయ్యప్ప కుమార్తె మేకల కావ్య ఏకంగా మేయర్‌ పదవితోనే తన రాజకీయ అరంగేట్రం చేశారు. కాగా, తొలిసారిగా కావ్య కార్పొరేటర్‌గా అత్యధిక మెజారిటీతో గెలుపొందడంలో సోదరుడు, టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు మేకల భార్గవరాం ముఖ్యపాత్ర పోషించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: