తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేరు చెబితే చాలు...ఒంటికాలి మీద లేచే నేతలు వైసీపీలో చాలమందే ఉన్నారు. ఎలాంటి మేటర్ అయిన కానీ...వారు మాత్రం బాబుని ఏకీపారేస్తారు. అలా బాబు అంటే ఫుల్ ఫైర్ అయ్యే నేతల్లో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ ముందు వరుసలో ఉంటారు. మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీకు వీర విధేయుడుగా ఉన్న జోగి రమేశ్...కాంగ్రెస్‌లో కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చారు. 2004లో ఎమ్మెల్యేగా అవకాశం రాకపోయిన, పార్టీ కోసం కష్టపడుతూనే వచ్చారు.

 

ఈ క్రమంలోనే వైఎస్సార్ 2009లో జోగికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. కాకపోతే సొంత నియోజకవర్గం మైలవరం కాకుండా...పెడన బరిలో దింపారు. అయితే తొలిసారి బరిలో దిగిన..తన సత్తా చాటుతూ టీడీపీ సీనియర్ నేత కాగిత వెంకట్రావుని చిత్తు చేశారు. అయితే ఆ తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ సెపరేట్ పార్టీ పెట్టడంతో, జోగి ఎమ్మెల్యే పదవి కూడా వదులుకుని జగన్ వైపు నడిచారు. ఇక 2014 ఎన్నికల్లో జగన్ మైలవరం టికెట్ ఇవ్వడంతో జోగి అటు వెళ్ళిపోయారు. ఆ ఎన్నికల్లో దేవినేని ఉమా చేతిలో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

 

2019 ఎన్నికలకొచ్చేసరికి జోగి...మళ్ళీ పెడన బరిలో దిగి విజయం సాధించి....రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జోగి, టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. తమ ప్రభుత్వం మీదుగానీ,  సీఎం జగన్ మీదుగానీ టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తే అసలు ఊరుకోవడం లేదు. వెంటనే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. అటు అసెంబ్లీలో కూడా టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఇంత టీడీపీ అంటే ఇంత ఫైర్ చూపించే జోగి, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కాస్త వెనకబడే ఉన్నారు.

 

ఆయన ఎక్కువ రోజులు విజయవాడలో, తక్కువ సమయం పెడనలో ఉంటున్నట్లు తెలిసింది. అలాగే అభివృద్ధి విషయంలో కూడా అంత ఎఫెక్టివ్‌గా పని చేస్తున్నట్లు లేదు. అయితే పంచాయితీ, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటీవల నియోజకవర్గంలో కొత్త సిమెంట్ రోడ్లకు శంఖుస్థాపన చేశారు. కాకపోతే సంక్షేమ పథకాలు అందించడంలో జోగి ముందే ఉన్నారు. మొత్తానికైతే జోగి రమేశ్ ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రవేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: