నెల్లూరు జిల్లాలో గంజాయ్‌, గుట్కా అక్రమ రవాణాపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇన్నాళ్లూ చిన్నచిన్న ఏజెంట్లను, దుకాణదారులను అరెస్ట్ చేసిన ఖాకీలు ఇప్పుడు... అసలైన కింగ్ పిన్ లను‌ అరెస్ట్ చేస్తూ మూలాలను ఛేదిస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను జిల్లా ఎస్పీ వెనకుండి నడిపిస్తున్నారు.

 

గుట్కా అక్రమ దందాకు నెల్లూరు జిల్లా ఫేమస్‌. ఈ జిల్లాకు చెందిన చాలామంది వ్యాపారులు బెంగళూరు, చెన్నై కేంద్రంగా కోస్టల్ ఏరియాలో దళారులను పెట్టుకొని అక్రమ వ్యాపారం చేస్తున్నారు. గతంలో పోలీసు అధికారులు తూతూ మంత్రంగా కిందిస్థాయిలో దాడులు చేసేవారు. అయితే జిల్లాకు నూతనంగా వచ్చిన ఎస్పీ భాస్కర్ మాత్రం తనదైన శైలిలో ఈ అక్రమదందాకు అసలైన  సూత్రధారులను టార్గెట్‌ చేశారు. వారికి సహకరిస్తున్న పోలీసు అధికారులపైనా వేటు వేశారు. ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌నూ ఏర్పాటు చేసారు. తాజాగా, ఈ అక్రమ దందా చేస్తున్న అంజిబాబు, వెంకటేష్ అనే ఇద్దరు వ్యాపారులను టాస్క్‌ఫోర్స్‌ టీం అరెస్ట్‌ చేసింది. వీరిద్దరిదీ నెల్లూరు జిల్లానే కావడం విశేషం. 

 

జిల్లాలోని కట్టుబడిపాలానికి చెందిన అంజిబాబు చెన్నైలో ఉంటూ బెంగుళూరు బొమ్మసముద్రం అడ్డాగా గంజాయి, గుట్కా దందాను అపరేట్ చేస్తున్నాడు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గుట్కాను‌ సరఫరా చేస్తున్నాడు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకోగానే గుట్కా వ్యాపారంలో కింగ్‌ పిన్‌లపై దృష్టి పెట్టి అంజిబాబు డేటా బయటకు లాగారు. అతనితో పాటు ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. 

 

జాతీయ రహదారిని  ఆనుకుని ఉన్న చాలా పీఎస్‌లలో అధికారులు.. అంజిబాబు వ్యాపారానికి మద్దతుగా ఉన్నారనే విమర్శలున్నాయి. నెలకు సుమారు రూ.40 కోట్ల వరకు జరుగుతున్న ఈ అక్రమదందాలో కొందరు బడానేతల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వీరిని బయటకు లాగుతారా? లేదా? అనేది చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న 'గుట్కా రాజు'ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మరో ఐదుగురు పంపిణీదారులను అదుపులోకి తీసుకున్నారు. 

 

గుట్కా దందాలో అసలు బాస్‌లను వదిలేసి ఏజెంట్ల ను మాత్రమే అరెస్ట్ చేసారంటూ గతంలోనే ఎన్టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఎస్పీగా బాధ్యతలు తీసుకోగానే.. టాస్క్ పోర్స్ ఏర్పాటు చేసి అసలు నేరస్తులపై దృష్టి సారించారు. తాజాగా, 440కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడు, భద్రాచలానికి చెందిన ఇద్దరు అరెస్ట్ అయ్యారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఈ దందాను సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కాలేజీ విద్యార్థులు కూడా బ్రోకర్లుగా మారడంతో దీనిపై పోలీసుల ప్రత్యేక టీమ్‌ పనిచేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: