టీటీడికి చిల్లర కష్టాలు తప్పనుందా..? టీటీడి గోదాముల్లో పేరుకుపోయిన నాణేలకు మోక్షం కలగనుందా..?  మొన్నటి వరకు చలామణిలో ఉన్న నాణేలు మార్పిడికి ఇబ్బందులు పడ్డ టీటీడీ.ఇప్పుడు చలామణిలో లేని వాటిని కరిగించడానికి సిద్దమవుతోంది. రిజర్వ్ బ్యాంక్‌ అనుమతితో సేలంలో వున్న సెయిల్‌ ద్వారా 80 టన్నుల చలామణిలో లేని నాణేలను కరిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది టీటీడి.

 

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనం తర్వాత మొక్కుల చెల్లించడానికి హుండిలో కానుకలు సమర్పిస్తారు భక్తులు. స్వామి వారికి నగదు, నాణేలు, బంగారు, వస్తు రూపంలో కానుకలు సమర్పిస్తారు.ఈ కానుకలను పరకామణిలో లెక్కిస్తారు టీటీడి సిబ్బంది. ఇలా ఏటా స్వామి వారికి హుండి ద్వారా లభించే ఆదాయం 1300 కోట్లకు చేరుకుంది. ప్రతి నిత్యం హుండిలో సమర్పించే నాణేల విలువ 12 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. బయటా చిల్లర నాణేలకు డిమాండ్ లేకపోవడంతో వాటి మార్పిడి టీటీడీకి కష్టతరంగా మారింది. దాదాపు టీటీడీ వద్ద నిల్వ ఉన్న 30 కోట్ల చిల్లర నాణేలపై కొత్త టీటీడీ బోర్డు దృష్టి సారించింది. బ్యాంకులను ఒప్పించి చలామణిలో ఉన్న నాణేలను మార్పిడి చేసింది టీటీడి. ఇప్పుడు చలామణిలో లేని నాణేలను మార్పిడి చేసేందుకు సన్నద్ధమవుతోంది టీటీడీ.

 

టీటీడీ వద్ద 1 వ శతాబ్ధ కాలంలోని రోమన్ చక్రవర్తుల నాణేల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన కాసుల వరుకు నిల్వలు ఉన్నాయ్. చలామణిలో లేని నాణేల నిల్వలు రోజురోజుకు పెరుగుతూ 80 టన్నులకు చేరింది. వీటిలో అత్యధికంగా 25 పైసల నాణేలు ఉన్నాయి. ఇప్పటికే 25 పైసల నాణేలు రద్దయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు 2014 ఫిబ్రవరి వరకు బ్యాంకుల్లో మార్పిడి చేస్తూ వచ్చింది టీటీడీ. అయితే ఆ తర్వతా నుంచి ఈ నాణేలు స్వీకరించేందుకు బ్యాంకులు అంగీకరించలేదు. మరోవైపు భక్తులు హుండిలో చెల్లుబాటులో లేని నాణేలు సమర్పిస్తూనే ఉన్నారు. దీంతో అమాంతంగా నిల్వలు పెరిగాయి. చలామణిలో లేని నాణేలు మార్పిడి కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని రప్పించింది టీటీడి.

 

ఆరు నెలల పాటు పరకామణలో , టీటీడీ ట్రెజరిలో పరిశీలన జరిపిన కమిటీ ఓ నివేదిక సిద్ధం చేసింది. టీటీడి వద్ద ఎంతో పురాతనమైన బంగారు, వెండి, రాగి నాణేలు వున్నాయని తేల్చింది కమిటీ. వీటిలో 1 వ శతాబ్ధం కాలం నుంచి ఎంతో ప్రాముఖ్యత ఉన్న బంగారు, వెండి, రాగి నాణేలు ఉన్నాయ్. ప్రాధాన్యతా దృష్టా ఈ నాణేలను భద్రపర్చాలని టీటీడీకి సూచించింది టీటీడీ. చలామణిలో లేని మిగతా నాణేల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్‌ను సంప్రదించాలని సూచించారు. చలామణిలో లేని నాణేలుకు బహిరంగ మార్కెట్లో ఎక్కువ మొత్తంలో చెల్లించేందుకు అవకాశం వున్నా.... నిబంధనలు విషయంలో అది చట్టవ్యతిరేకం కావడంతో రిజర్వ్ బ్యాంక్‌ను సంప్రదించింది టీటీడి. 

 

రిజర్వ్ బ్యాంక్ సూచన మేరకు కేంద్ర ఆర్ధిక శాఖని సంప్రదించినా ఎలాంటి సమాచారం లేదు. దీంతో తిరిగి రిజర్వ్ బ్యాంక్‌ సూచన మేరకు సేలంలో వున్న సెయిల్ ద్వారా నాణేలు కరిగించడానికి సిద్ధమైంది టీటీడీ. చలామణిలో లేని నాణేలకు టన్నుకు 29 వేల 9 వందల 72 రూపాయలను చెల్లించాలని సెయిల్‌ని ఆదేశించింది రిజర్వ్ బ్యాంక్. టీటీడీ వద్ద నిల్వగా వున్నా అణా, 1.2,5,10,25 పైసల నాణేలను అల్యూమినియం, నికెల్‌, స్టీల్‌, రాగి, ఇత్తడిగా కరిగించేందుకు అంగీకరించింది సెయిల్. దీంతో టీటీడీ గోదాముల్లో నిల్వలుగా పేరుకుపోయిన చలామణిలో లేని నాణేలకు మోక్షం లభించనుంది. మరోవైపు ఈ నాణేల ద్వారా టీటీడీకి ఆదాయం లభించనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: