ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు దారులు వెతుకుతూనే ఉన్నారు. నాలుగు రోజుల్లో మరణదండన ఉన్నా కూడా...దాన్నుంచి బయటపడేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు సంబంధించి ముకేశ్‌ సింగ్ వేసిన పిటిషన్‌పై సీజేఐ స్పందించారు. కోర్టు రిజిస్ట్రీలో పిటిషన్‌ చేర్చాలని అతడి తరఫు న్యాయవాదికి సూచించారు ప్రధాన న్యాయమూర్తి.

 

డెత్ వారెంట్ జారీ అయినా..నాలుగు రోజుల్లో ఉరికంభం ఎక్కబోతున్నా కూడా...నిర్భయ దోషులకు ఇంకా ప్రాణంపై తీపి చావలేదు. నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై.... సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పందించింది. ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న వ్యక్తి కావడంతో..విచారణ జాబితాలో టాప్ ప్రియారిటీ కల్పిస్తామన్నారు ప్రధాన న్యాయమూర్తి. రిజిస్ట్రీని ఆశ్రయించాలని ముకేశ్ న్యాయవాదికి సూచించారు. 

 

తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడంపై... ఆర్టికల్‌ 32 కింద జ్యూడీషియల్‌ రివ్యూ కోరుతూ ముకేశ్‌ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాడు. అత్యవసరంగా విచారణ జరపాలన్న దోషి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. ముకేశ్ సింగ్ క్షమాభిక్ష అభ్యర్థనను  రాష్ట్రపతి ఈనెల 17న తిరస్కరించారు. 

 

మరోవైపు నిర్భయ దోషులను ఉరితీసేందుకు అధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తీహార్ జైల్లో దీనికి సంబంధించిన చర్యలు ప్రారంభమయ్యాయి. నలుగురు దోషులు వినయ్ శర్మ,  అక్షయ్ కుమార్ సింగ్,  ముఖేష్ కుమార్ సింగ్,  పవన్ లను ఫిబ్రవరి ఒకటిన ఉదయం 6 గంటలకు ఉరితీయనున్నారు. ఇప్పటికే తలారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇలాంటి ప్రక్రియను మరో రెండు మూడు సార్లు నిర్వహిస్తారని జైలు అధికారులు చెబుతున్నారు.

 

మొత్తానికి ఓ వైపు ఉరి కంబానికి ఏర్పాట్లు జరుగుతుంటే.. నిందితులు బయటపడేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఏదొక సాకు చూపి తప్పించుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే ఒక్కొక్కటిగా దారులు మాత్రం మూసుకుపోతున్నాయి. బయటపడే వీలులేకుండా పోతోంది. దీంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంటలకు ఆ నలుగురికి ఉరితీయడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: