ప్రపంచంలోని దేశాలన్నింటినీ కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, పౌర విమాన శాఖ కరోనా వైరస్ ఇండియాలోకి రాకుండా తగిన చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా అధికారులు విశాఖ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే ప్రయాణికులను, విదేశాల నుండి వచ్చే ప్రయాణికులను పరిశీలిస్తున్నారు. 
 
అధికారులు విదేశాల నుండి వచ్చే వారి కోసం ఇక్కడ ప్రత్యేక పరీక్షలను చేపడుతున్నారు. అధికారులు విశాఖ ఎయిర్ పోర్టులోని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల దగ్గర ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అధికారులు ముఖ్యంగా సింగపూర్, చైనా, దుబాయ్, మలేషియా నుండి విశాఖ వస్తున్న వారిని పూర్తిగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ నగరంలోకి ఎటువంటి కరోనా వ్యాధి లక్షణాలు లేవని నిరూపితమైతే మాత్రమే అనుమతి ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 
 
చైనాలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటివరకు చైనాలో దాదాపు 106 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ఇప్పటివరకు వ్యాధికి కేంద్రంగా మారిన వుహాన్ లోనే భారీ సంఖ్యలో మృతి చెందారు. తాజాగా చైనా రాజధాని బీజింగ్ లో కూడా కరోనా వైరస్ బారిన పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ బారిన పడి 24 మంది మృత్యువాత పడ్డారు. 
 
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా 4000 మందికి పైగా సోకినట్లు తెలుస్తోంది. శ్రీలంక, జర్మనీ దేశాలలో కరోనా వైరస్ కు సంబంధించిన తొలి కేసు నమోదైంది. చైనా నుండి వచ్చిన వారిని ప్రత్యేక వార్డులలో ఉంచి ఈ దేశాలలో విమానశ్రయాల్లోనే పరిశీలిస్తున్నారు. భారత్ లోని ప్రముఖ విమానశ్రయాల్లో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసి థర్మల్ పరీక్షలు జరిపి అనుమానితులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: