కరోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాణాంత‌క వ్యాధి భార‌త్‌లోనూ అడుగుపెట్టింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటు హైద‌రాబాద్ అటు విశాఖ‌ప‌ట్ట‌ణం ఎయిర్‌పోర్ట్‌లో అనుమానితుల వార్త‌లు ప‌లువురిని ఆందోళ‌న‌కు గురి చేశాయి. ఈ నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు వేర్వేరుగా ఈ వ్యాధిపై స్పందించారు. 

 

తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్పందిస్తూ, కరోన వైరస్ తెలంగాణలో ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని తెలిపారు. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవ‌ద్దని ఆయ‌న కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు మానిటర్ చేస్తోంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం కరోన వైరస్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామ‌ని వెల్ల‌డించారు. కేంద్ర బృందం కూడా ప్రస్తుతం నగగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పర్యటిస్తోంద‌ని, బుధ‌వారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వెల్ల‌డించారు.

 


కాగా, రోనా వైరస్ పై ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మాత్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలోని 5వ భవనంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన కరోనా వైరస్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ కు సంబంధించి కేసులేమీ నమోదు కాలేదని దీనిపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని కావున ప్రజలెవ్వరూ దీని గురించి భయపడం లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వెంటనే కరోనా వైరస్ కు సంబంధించి 5 పడకలతో కూడిన ప్రత్యేక(Isolation) వార్డును ఏర్పాటు చేయడంతో పాటు వెంటిలేటర్లను కూడా అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

 

కరోనా వైరస్ పై తక్షణం రాష్ట్రంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి శ్రీనివాస్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ కు సంబంధించి కేసులేమీ నమోదు కాలేదని ప్రజలెవ్వరో ఈ విషయంలో భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.కరోనా వైరస్ పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరూ నిరంతరం పూర్తి అప్రమత్తతతో ఉండాలని వైద్య ఆరోగ్య మంత్రి కాళీకృష్ణ శ్రీనివాస్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: