మద్యం అలవాటు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని మద్య విమోచన ప్రచార  కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. బహుజన మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం లామ్  గ్రామంలోని కొత్త కాలనీలో మద్యపానం దుష్పరిమాణాలు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమానికి అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారని, అవి విజయవంతం కావాలంటే మద్యం లేని సమాజం అవసరమని తెలిపారు. రాష్ట్రంలో దశల వారీగా మద్యం వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వం బెల్టుషాపులను నియంత్రించడంతో పాటు మద్యం దుకాణాలను తానే నిర్వహిస్తుందని పేర్కొన్నారు. గత ఏడాది రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయల మద్యం విక్రయం జరిగిందని, అందులో 35 వేల కోట్ల రూపాయలు పేదలే ఖర్చు చేశారని తెలిపారు. మద్యపాన వ్యసనం నుంచి విముక్తం చేసేందుకు అన్ని జిల్లాల్లోనూ డి అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలలో మద్యపాన వ్యసన పరులకు ఉచితంగా వైద్యం, మందులు అంద చేయనున్నట్లు పేర్కొన్నారు.  2024 నాటికి సంపూర్ణ మద్య నిషేధం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, దానికి అందరూ కృషి చేయాలని కోరారు. మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని అన్ని శివారు కాలనీల్లో మద్యపానం అనర్ధాల పై అవగాహన సదస్సులు  నిర్వహిస్తామని తెలిపారు. గుంటూరు ఆర్టిఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల బాగు కోసమే ప్రభుత్వం దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తుందని తెలిపారు. లక్ష్మణ రెడ్డి ఎన్నో ఏళ్ల నుంచి మద్యపానంపై పోరాటం చేసినందుకే ప్రభుత్వం ఆయనకు పదవి ఇచ్చిందని పేర్కొన్నారు. కుటుంబం బాగుంటేనే దేశం బాగుంటుంది అని, మద్యపానం అలవాటు లేని కుటుంబాలు అన్ని విషయాల్లో బాగా ఉంటాయని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన బహుజన సభ కేంద్ర కార్యదర్శి జి .ఆర్. భగత్ సింగ్ మాట్లాడుతూ లక్ష్మణ రెడ్డి కాలనీ కి వచ్చారంటే వెలుగు వచ్చినట్లే అని తెలిపారు. ఆయన కలెక్టర్ తో మాట్లాడటం వల్లనే కాలనీ కి విద్యుత్ సౌకర్యం వచ్చిందని గుర్తు చేశారు. కుటుంబాలను పేదరికంలోకి నెట్టి వేసే మద్యం దురలవాటుకు దూరంగా ఉండాలని సూచించారు. సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ కన్వీనర్ ప్రొఫెసర్  అరవింద్ మాట్లాడుతూ  పేదలు ఆత్మగౌరవంతో జీవించే సమాజమే అంబేద్కర్ ఆశయ మని, మద్యపానానికి దూరంగా ఉంటేనే అటువంటి సమాజం వస్తుందని తెలిపారు. మద్యానికి దూరంగా ఉంటూ బిడ్డలను బాగా చదివించు కోవాలని  సూచించారు. చదువుతోనే సామాజిక అసమానతలు తొలగిపోతాయని తెలిపారు. కాటూరి మెడికల్ కాలేజీ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ కోట సురేష్ కుమార్ మాట్లాడుతూ లక్ష్మణ రెడ్డి నేతృత్వంలో మద్య విమోచన ప్రచార కమిటీ సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపారు. మద్యం మానేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలకు తమ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం మందులు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ తహసీల్దార్ కుటుంబరావు,  చాగంటి రవీందర్ రెడ్డి, చాగంటి వసంత,  రజక జనసేవ సంఘం ప్రతినిధి జూపూడి శ్రీనివాసరావు, దళిత నాయకుడు దాసరి రాజు, లాంగ్ క్వారీ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఆదిల్ తదితరులు  ప్రసంగించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: