రాజకీయాల్లో తొలిసారి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని తొలి విజయం అందుకోవడం చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఏదో మంచి సుడి ఉంటే తప్ప అలాంటి విజయాలు సొంతం కావు. ఇక అలా సుడి బాగా తిరిగిన నేతల్లో కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ కూడా ఉంటారు. 2014లో పామర్రులో వైసీపీ తరుపున గెలిచిన ఉప్పులేటి కల్పన టీడీపీలోకి జంప్ చేయడంతో, అప్పటివరకు ఓ చిన్న నేతగా ఉన్న కైలాకు బంపర్ ఆఫర్ వచ్చింది. కల్పన అటు టీడీపీలోకి వెళ్లిపోవడమే, జగన్...కైలాని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించేశారు.

 

ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కైలా నియోజకవర్గంలో పని చేసుకుంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేస్తూ, అప్పటి అధికార టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. అటు తన తల్లి జ్ఞానమణి జెడ్పీటీసీ కావడం వల్ల లోకల్‌లో మంచి పట్టు తెచ్చుకున్నారు. ఆ విధంగా కష్టపడటంతో 2019 ఎన్నికల్లో పామర్రు సీటుని కైలాకే కేటాయించారు. ఇక జగన్ ప్రభావం, రాష్ట్రమంతా టీడీపీ వ్యతిరేక పవనాలు వీయడంతో అనిల్ దాదాపు 30 వేల పైనే ఓట్ల మెజారిటీతో ఉప్పులేటి కల్పనపై గెలిచారు.

 

అయితే దివంగత ఎన్టీఆర్ సొంత గ్రామం నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలోనే ఉంటుంది. ఆ విధంగా ఎన్టీఆర్ పుట్టిన గడ్డపై అనిల్ 30 వేలపైనే మెజారిటీతో గెలిచి టీడీపీకి రక్త కన్నీరు మిగిల్చారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ ప్రజలతో ఇంకా ఎక్కువ మమేకమవుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 8 నెలలే కావడంతో పెద్ద ఎత్తున ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అదేవిధంగా పార్టీలో అనిల్ పెద్దగా హైలైట్ కూడా కాలేదు. అటు అసెంబ్లీలో కూడా ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భాలు లేవు.

 

ఈ విషయాలు పక్కనబెట్టేస్తే అనిల్‌పై అమరావతి ప్రభావం బాగా ఉందని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల పట్ల పామర్రు మెజారిటీ ప్రజలు అంత పాజిటివ్‌గా లేరని తెలుస్తోంది. అదే సమయంలో మూడు రాజధానులకు మద్ధతు తెలిపేవారు ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఏం చేస్తే మాకెందుకులే అని తటస్థంగా ఉన్నవారు కూడా ఉన్నారు. కాకపోతే పామర్రు విజయవాడకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, మెజారిటీ ప్రజలు అమరావతికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీదైతే అమరావతి ఎఫెక్ట్ అనిల్ మీద కాస్త పడిందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: