జగన్మోహన్ రెడ్డి తొమ్మిది మాసాల పరిపాలన చూసిన తర్వాత చాలామందికి ఇలాగే అనిపిస్తోంది.  జగన్ కు మంచి సలహాదారు అవసరమనే  అభిప్రాయం చాలామందిలో పెరుగుతోంది. సిఎంకు రోజు ఎదురయ్యే సమస్యల్లో పాలనాపరమైన పరిష్కారింకునేవి ఉంటాయి. అలాగే రాజకీయ కోణంలో పరిష్కరించుకోవాల్సిన సవాళ్ళు కూడా ఉంటాయి. పాలనలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ప్రధాన కార్యదర్శితో పాటు అధికారయంత్రాంగం ఎటూ ఉంటుంది. మరి రాజకీయ కోణంలో పరిష్కరించాల్సిన సవాళ్ళ మాటేమిటి ?

 

ముఖ్యమంత్రిగా ఎవరున్నా పై రెండు సమస్యలను జాగ్రత్తగా బ్యాలన్స్ చేసుకుని ధీటుగా ఎదుర్కోగలిగిన వాళ్ళే సక్సెస్ ఫుల్  సిఎంలుగా పేరుతెచ్చకుంటారు. మరి తొమ్మిది నెలల పరిపాలనలో జగన్ పరిస్ధితేమిటి ? ఏమిటంటే సంఖ్యాపరంగా అసెంబ్లీలో బంపర్ మెజారిటి ఉందన్నది వాస్తవం. అదే సమయంలో  జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అత్యంత వివాదాస్పదమవుతున్న విషయం  అందరూ చూస్తున్నదే. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వివాదాలు శాసనమండలి రద్దు తీర్మానం వరకూ ప్రతిదీ వివాదాస్పదమే. నిజానికి ఇందులో చాలా వరకు ప్రజాహితంతో కూడిన నిర్ణయాలే అనటంలో సందేహం లేదు. కానీ రాజకీయకోణంలో మాత్రం ప్రతిపక్షాలు బాగా రాద్దాంతం చేస్తున్నాయి.

 

ఇక్కడ సమస్యేమిటంటే జగన్ కు మిగిలిన పార్టీలకు మధ్య మీడియేషన్  చేయగలిగిన వాళ్ళు లేకపోవటమే. ఇక్కడ లేకపోవటమంటే జగనే పెట్టుకోలేదనటం సబబుగా ఉంటుంది. ప్రభుత్వంలో చాలామంది సలహాదారులుగా ఉన్నా వాళ్ళవల్ల పెద్దగా ఉపయోగం లేదనే  చెప్పాలి. ఒకపుడు వైఎస్సార్ కు కేవిపి రామచంద్రరావు సలహదారుగా ఉండేవారు. వైఎస్ కు ఎప్పుడైనా సమస్య ఎదురైనా పరిష్కార బాధ్యత కేవిపి భుజానేసుకునేవారు.

 

వైఎస్ కూడా తన కేవిపితోనో లేకపోతే ఉండవల్లి లాంటి  మద్దతుదారులతోనో మనసువిప్పి తనకేం కావాలో స్పష్టంగా చెప్పేవారు. అదే సమయంలో వాళ్ళు చెప్పిన సలహాలను, సూచనలను ఓపిగ్గా వినేవారు. కానీ ఇపుడు జరుగుతున్న రాద్దాంతం చూస్తుంటే లోపమంతా జగన్ లోనే ఉందేమో అనిపిస్తోంది. ఎదుటి వాళ్ళు చెప్పేది అసలు జగన్ వింటున్నాడా ? అసలు సలహాలు, సూచనలు చెప్పే అవకాశం ఇస్తున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

అసలు సలహాలు, సూచనలు చెప్పటానికి జగన్ ఎవరికీ అవకాశం ఇవ్వడనే  ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తోంది. జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఆరోపణలే నిజమనుకోవాల్సొస్తోంది. జరుగుతున్న వ్యవహారాలను జగనే ఒకసారి స్వీయ సమీక్ష చేసుకుంటే చాలా మంచిది. జగన్ కు ఇపుడు అర్జంటుగా సీనియర్, అన్నీ పార్టీలతోను మంచి సంబంధాలున్న నేత, ఢిల్లీ స్ధాయిలో పట్టుండే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నేతలు చాలా అవసరం.

 

వైఎస్ సక్సెస్ ఫుట్ సిఎం అనిపించుకుంటున్నారంటే కేవిపి, ఉండవల్లి లాంటి సమర్ధులను ఉపయోగించుకోవటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి జగన్ కూడా ప్రిస్టేజికి పోకుండా  ఉండవల్లి లాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని వాళ్ళ  సలహాలతోను, మార్గదర్శకత్వంలో ముందుకెళితే న్యాయ, పరిపాలనా, రాజకీయ సమస్యలు అవే పరిష్కారమవుతాయి.  మంచి సలహారులను పక్కన పెట్టుకోవటం కూడా తెలివైన రాజు లక్షణమని జగన్ గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: