విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని మైండ్ లో బలంగా ఫిక్స్ అయిన ఏపీ సీఎం జగన్ ఈ విషయంలో ముందడుగు వేయాలనే చూస్తున్నారు. ఇప్పటికే మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో నెగ్గించుకున్న జగన్ మండలిలో ఆ బిల్లు పెండింగ్ లో పడడంతో ఏకంగా శాసన మండలిని రద్దు చేసేందుకు కూడా వెనకాడకుండా ఆ బిల్లును కూడా అసెంబ్లీలో నెగ్గించుకున్నారు. దీనిని బట్టి చూస్తే విశాఖను రాజధానిగా చేయాలనే విషయంలో జగన్ ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థమైపోతుంది. తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా జగన్ మాత్రం విశాఖ నుంచి పరిపాలన చేసేందుకు వీలుగా సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు.


 దీనిలో భాగంగానే ఉగాది తన పరిపాలన విశాఖ నుంచి మొదలు పెట్టేందుకు ముహూర్తం కూడా పట్టించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై మొదట్లో కొద్ది రోజులు ఆందోళన లు జరిగినా ఆ తరువాత అంతా సద్దుమణిగి పోతుందని జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా మూడు రాజధానుల  వ్యవహారాన్ని, న్యాయ కార్యనిర్వాహక ప్రక్రియ ద్వారా ఒక కొలిక్కి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రక్రియ ఇప్పుడు అప్పుడే తేలే వ్యవహారం కాదని, అందుకే దానితో సంబంధం లేకుండా విశాఖలో రాజధానిని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగంలోని నిబంధనలు న్యాయ విభాగం సలహాతో ముఖ్యమంత్రి పూర్తిగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఉగాది లోపు విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.

 

 ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటు, సీఎంఓ కార్యాలయాన్ని కూడా విశాఖను తరలించాలని చూస్తున్నారు. రాజధాని అనే పదమే అసలు రాజ్యాంగంలో ఎక్కడా  పొందుపరచలేదు అని, ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించేందుకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. దీనిలో భాగంగానే మాజీ అటార్నీ జనరల్, ప్రస్తుతం రాజధాని కేసు వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఇచ్చిన సలహాతోనే జగన్ ఇప్పుడు విశాఖలో పరిపాలనపై దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. ఇప్పటికే పరిపాలనకు వీలుగా విశాఖలో బిల్డింగులను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: