శాసన మండలి రద్దు తీర్మానం అసెంబ్లీలో పెట్టిన వేళ.. 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. మిగిలిన 18 మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. అసలే కీలకమైన బిల్లు. జగన్ పట్టుదల గా ఉన్న బిల్లు.. మరి వీరు ఎందుకు డుమ్మా కొట్టారు.. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. చెన్నైలో తన సోదరుడు ఆసుపత్రిలో ఉండటం వల్ల ఓటింగ్ కు కొద్ది సమయం ముందు విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వెళ్లారట. మరోవిప్ దాడిశెట్టి రాజా ఆరోగ్యం బాగోలేక పోవడంతో సభ నుంచి బయటకు వెళ్లిపోయారట.

 

ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్నా.. సమయానికి లోపలికి రాలేకపోయారట. వారిద్దరూ ఎవరంటే.. గ్రంధి శ్రీనివాస్, మేకా ప్రతాప్ అప్పారావు. వారు లోపలకు వచ్చేందుకు ప్రయత్నించినా అప్పటికే తలుపులు మూసేశారట. పర్వత పూర్ణ చంద్రప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, యూవీ రమణమూర్తి రాజు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొలుసు పార్థసారధి వంటి వారు సభకు వచ్చి మరీ వివిధ కారణాలతో సభ నుంచి వెళ్లిపోయారట.

 

తల్లి చనిపోవడంతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇంటి వద్దే ఉన్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి జ్వరం కారణంగా రాలేదు. ఇక మిగిలి వారు అసలు సభకే రాలేదు.. వారు ఎవరంటే.. కోన రఘపతి, రాచమల్లు శివ ప్రసాద రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సింహాద్రి రమేష్ బాబు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, నవాజ్ భాషా, డి. శ్రీధర్ రెడ్డి.

 

కారణాలు ఏమైనా.. 18 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారట. కీలకమైన సమయాల్లో ఇంత పెద్ద సంఖ్యలో డుమ్మా కొట్టినందుకు తగిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారట. మరి వీరు జగన్ కు ఎలా సర్ది చెప్పుకుంటారో ఏమో..?

మరింత సమాచారం తెలుసుకోండి: