ఈ మధ్య కాలంలో రైళ్లలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో తూర్పు గోదావరి జిల్లా తుని దగ్గర మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుండి విశాఖ పట్నం వెళుతున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం జరిగింది. సీ3 ఏసీ బోగీలో మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. 
 
అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది మంటలను వెంటనే గుర్తించి రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది సకాలంలో చర్యలు చేపట్టటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. పూర్తి వివరాలలోకి వెళితే ఉదయం 7.10 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ 6.30 గంటలకు తుని ప్రాంతానికి చేరుకుంది. 
 
సీ3 బోగీలో మంటలు చెలరేగగా సిబ్బంది వెంటనే అప్రమత్తం కావటం చర్యలు తీసుకోవటం జరిగింది. ఈపాటికే విశాఖ చేరుకోవాల్సిన రైలు ప్రమాదం కారణంగా ఆలస్యంగా బయలుదేరింది. రైల్వే సిబ్బంది చర్యలు చేపట్టిన తరువాత ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
రైల్వే శాఖ నిర్లక్ష్యం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు. సిబ్బంది సకాలంలో అప్రమత్తం కాకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. ఏసీ బోగీలో మంటలు చెలరేగటానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే శాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు తరువాత బోగీలో మంటలు అంటుకోవటానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: