కర్నూలు వైసీపీలో అసంతృప్తి భగ్గుమంటోంది. ఇటీవల తన నియోజక వర్గంలో తనకు చెప్పకుండా ఇతరులు చేర్చుకోవడంపై వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండి పడుతున్నారు. టీవీ ఛానల్ తో మాట్లాడుతూ.. నన్ను సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడం సరికాదన్నారు. తాను అసెంబ్లీలో ఉండగా నియోజకవర్గంలో చేరికలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో చర్చించి కొత్తవారిని చేర్చుకోవాలి తప్ప ఇలా అడ్డగోలుగా చేర్చుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

 

అంతే కాదు.. తన నియోజకవర్గంలో పార్టీ ఇప్పటికే బలంగా ఉంది. కొత్త చేరికలతో ఒరిగేదేమీ లేదని తన అసంతృప్తిని కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తన పార్టీలోకి ఇతరులు వస్తుంటే స్వాగతించకుండా ఇలా మాట్లాడటం ఏంటని పార్టీ నేతలు అంటున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి స్పందించారు. పార్టీ బలోపేతానికే వైసీపీలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.

 

స్థానిక ఎన్నికల దృష్ట్యా కార్యకర్తల బలం పార్టీకి చాలా అవసరమని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభ్యుడిగా హఫీజ్‌ ఖాన్‌ ఎన్నికయ్యారని, రాబోయే నాలుగేళ్ల్లు ఆయనే ప్రజాప్రతినిధిగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. అఇలాంటప్పుడు అభద్రత ఎందుకని ప్రశ్నించారు. పార్టీలో చేరుతున్న వారిలో కర్నూలే కాకుండా ఆళ్లగడ్డ, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర నియోజకవర్గాల నుంచి కూడా ఉన్నారన్నారు.

 

రాష్ట్ర వ్యాప్తంగా 10వేల నుంచి 25 వేల మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారని, అయితే కర్నూలులో 5వేల మెజార్టీ మాత్రమే వచ్చిందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తాము ఇంట్లో కూర్చునే వ్యక్తులం కాదన్నారు. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానన్నా టీడీపీని వదిలి వచ్చామని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికలు దగ్గర్లో ఉన్న సమయంలో ఇలాంటి వివాదాలు పార్టీకి మంచివి కాదని, ఏవైనా ఉంటే పార్టీ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి మాట్లాడాలని మోహన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: