ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో , తెలుగుదేశం పార్టీ కొత్త శక్తిని పుంజుకుంటున్నట్లు కన్పిస్తోంది . జగన్ తీసుకుంటున్న తొందరపాటు  నిర్ణయాలు భవిష్యత్తు లో తమకు లాభించడం ఖాయమని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది . ప్రధానంగా మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే . అయినా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న కసితో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ఏమాత్రం వేచి చూసే ధోరణి లేకుండా అసెంబ్లీ లో పరిపాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులు ప్రవేశపెట్టారు .

 

అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ రెండు బిల్లులు , మండలి కు వెళ్లడం అక్కడ చైర్మన్ వాటిని సెలెక్ట్ కమిటీ కి పంపుతున్నట్లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి . మండలి నిర్ణయం పై ఆగ్రహించిన జగన్ అంతేవేగంగా మండలి రద్దు కు నిర్ణయం తీసుకున్నారు .  మరో ఏడాది గడిస్తే తమకు మండలిలో ఆధిక్యత లభిస్తుందన్న విషయాన్ని కూడా విస్మరించి తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకే ఎక్కువ నష్టాన్ని చేకూర్చనుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . మండలి రద్దుకు  అసెంబ్లీ తీర్మానం చేసిన జగన్ సర్కార్  , పార్లమెంట్ కు నివేదించనునుంది  . అయితే మండలి రద్దు ప్రతిపాదన  పార్లమెంట్ ముందుకు ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది . దాదాపు ఏడాదిపైగానే సమయం పట్టే  అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు సైతం అంచనా వేస్తున్నారు .

 

ఈ ఏడాది వరకు మండలి కొనసాగుతుందన్నట్టే లెక్క . అంటే తమకు ఏడాదిలోపు మండలి లో ఆధిక్యత లభించే అవకాశం ఉన్నప్పటికీ వేచి చూసే ధోరణి అవలంభించక పోవడం వల్లే చేజేతులా జగన్ మండలి రద్దు చేసుకున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . మండలి రద్దు నిర్ణయం వల్ల జగన్ వైఖరి పట్ల ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వ్యక్తం అవుతోందని , తన మాట  నెగ్గలేదని భావించే  మండలిని రద్దు చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందని చెబుతున్నారు . ఈ పరిణామాలన్నీ రాజకీయంగా టీడీపీ కి మేలు చేసేవిగా కన్పిస్తున్నాయని పేర్కొంటున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: