నన్ను ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది...కానీ నాపై అత్యాచారం జరగడానికి నన్ను జైలుకు పంపించారా..? ఉరికంబం ఎక్కకుండా  అన్ని ప్రయత్నాలు చేస్తున్న నిర్భయ దోషి ముకేష్ సింగ్ సుప్రీం కోర్టులో వేసిన ప్రశ్న ఇది...! రాష్ట్రపతి తనకు క్షమాభిక్షను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన ముకేష్ సింగ్...సంచలన ఆరోపణలు చేశాడు. తీహార్ జైల్లో తనను లైంగికంగా వేధించారని ఆరోపించాడు. వాదనలు విన్న న్యాయస్థానం ముకేష్ పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది. 

 

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో కొత్త విషయాలను తెరపైకి తెస్తున్నారు దోషుల తరపు న్యాయవాదులు. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముకేష్ సింగ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ముకేష్ సింగ్ తరపు న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు.. తీహార్ జైల్లో ముకేష్ సింగ్‌పై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపించారు. గ్యాంగ్ రేప్ లో దోషిగా తేల్చి కోర్టు మరణ శిక్ష విధిస్తే...జైల్లో మాత్రం ముకేష్ పై అత్యాచారం జరిగిందని ఆయన తరపు న్యాయవాది వాదించారు.  

 

క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపే విషయంలోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్ వాదించారు. క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి పరిగణలోకి తీసుకునే జైలర్ నివేదికను ప్రెసిడెంట్‌కు పంపలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని వాదించారు ముకేష్ లాయర్ అంజనా ప్రకాష్. 

 

నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో చనిపోయిన మరో నిందితుడు రామ్ సింగ్ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు.. తీహార్ జైల్లో రామ్ సింగ్ ను హత్య చేశారని కానీ  ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును క్లోజ్ చేశారన్నారు. మరోవైపు ముకేష్ సింగ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు నిర్భయ తల్లి.

 

 ఉరిశిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారు. అన్ని మార్గాలు దాదాపుగా మూసుకుపోయాయి. ముకేష్ పిటిషన్‌ ను రేపు కోర్టు తిరస్కరిస్తే... షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఆ నలుగురు ఉరికంబం ఎక్కుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: