పాక్ అంతు చూడటానికి పదిరోజులు చాలు..! మూడు యుద్ధాల్లో ఓడినా వాళ్లకు బుద్ది రాలేదు..! ప్రధానమంత్రి మోడీ పాక్‌పై ఈ వ్యాఖ్యలను ఇప్పుడే ఎందుకు  చేశారు...? ఢిల్లీ ఎన్నికలను పాకిస్థాన్‌తో ముడి పెడుతూ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు...? సమయం....సందర్భం ఏంటో తెలుసా..?

 

సర్జికల్ స్ట్రైక్స్..... పాక్‌తో యుద్ధం.....దేనికైనా సిద్ధం...బీజేపీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దేశంలో ఎక్కడో ఎన్నికలు జరుగుతున్నాయని అర్ధం చేసుకోవాలి..! ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో కమలనాథులు ఇప్పుడు వీటిపైనే ఫోకస్ చేశారు. ఢిల్లీ ఎన్నికలను పాకిస్థాన్‌తో ముడిపెట్టి ఓ బీజేపీ నేత వివాదాస్పద ట్వీట్ చేస్తే.. తాజాగా మోడీ కూడా పాక్ పై ఫైర్ అయ్యారు. మన సైన్యం తలచుకుంటే పాక్‌ను మట్టికరిపించడానికి పది రోజులు చాలన్నారు. 

 

యుద్ధమే వస్తే 10-12 రోజుల్లో పాకిస్థాన్‌ను ఓడిస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలో NCC ర్యాలీలో పాల్గొన్న మోడీ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు..భారత్ తో మూడు సార్లు యుద్ధం చేసినా పాక్ కు బుద్ధి రాలేదని ఇప్పటికీ పరోక్ష యుద్ధం చేస్తూనే ఉందని విమర్శించారు. 

 

ఎన్నికలను ప్రభావితం చేసేందుకే పాకిస్థాన్ ప్రస్తావన తెస్తున్నారన్న విమర్శలు విపక్షాలు గతంలో కూడా చేశాయి. మోడీ పాక్‌తో యుద్ధం గురించి మాట్లాడితే ఓ బీజేపీ అభ్యర్ధి ఏకంగా ఢిల్లీ ఎన్నికలను పాక్‌తో ముడి పెట్టేశారు. ఢిల్లీ ఎన్నికలను ఇండియా వర్సెస్ పాకిస్థాన్‌గా చూడాలంటూ....బీజేపీ అభ్యర్ధి కపిల్ మిశ్రా చేసిన వివాదాస్పద ట్వీట్ ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కపిల్ మిశ్రాపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

 

మొత్తానికి ఎన్నికల వేళ ప్రధాని మోడీ నోట నుండి యుద్ధం వ్యాఖ్యలు వచ్చాయి. పైగా పాకిస్థాన్ గురించి మాట్లాడటం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మన సైన్యం తలుచుకుంటే పాక్ ను నామరూపాల్లేకుండా చేయగలదు అని ఆయన ప్రస్తావించిన మాటలు కయ్యానికి కాలుదువ్వుతున్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: