కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిర‌స‌న‌లు ఆగ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న‌దేశంలో జ‌రిగిన ఈ ఆందోళనలు విదేశాలకూ పాకాయి. అమెరికాలోని 30 రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, షికాగో, హ్యూస్టన్‌,  శాన్‌ ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో నివసిస్తున్న వందల మంది ప్రవాస భారతీయులు 71వ గణతంత్ర దిన వేడుకలను తమ నిరసనకు వేదికగా చేసుకున్నారు. బ్యాన్లరు, ప్లకార్డులు పట్టుకొని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌, ఈక్వాలిటీ ల్యాబ్స్‌, హిందూస్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ తదితర సంస్థలు ఈ ప్రదర్శనలకు నేతృత్వం వహించాయి.

 

వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన ప్రదర్శనలో రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత సందీప్‌ పాండే పాల్గొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు ఖూనీ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజలే కాపాడుకుంటారనే నమ్మకం ఈ ఉద్యమంతో తనకు కలిగిందని చెప్పారు. మరోవైపు ఈయూ పార్లమెంట్‌లో సీఏఏపై బుధవారం చర్చ, గురువారం ఓటింగ్‌ జరుగనుంది. పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీ అయిన ‘యురోపియన్‌ పీపుల్స్‌ పార్టీ’(ఈపీపీ).. సీఏఏతో భారీగా ప్రజలు నిలువనీడను కోల్పోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది. కేంద్రం సీఏఏను అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మార్చిందని కాంగ్రెస్‌ విమర్శించింది.

 

ఇదిలాఉండ‌గా, సీఏఏపై ఈయూ పార్లమెంట్‌ చర్చించనుండటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. సీఏఏ పూర్తిగా భారత అంతర్గత విషయమని, ఈ అంశంలో విదేశీ సంస్థలు, ప్రభుత్వాల జోక్యం అవసరం లేదని ఆయ‌న స్పష్టం చేశారు. ఇలాంటి ప్రకటనలు, చర్చలు అవాంఛనీయమన్నారు. మరోవైపు ఒక దేశ చట్టాలపై మరో దేశం తీర్మానం చేయడం సమంజ సం కాదని  స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. ఈ మేరకు ఈయూ పార్లమెంట్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మరియా సస్సోలికి లేఖ రాశారు. కాగా.. పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కులపై జరుగుతున్న వేధింపులపై కూడా ఈయూ పార్లమెంట్‌ స్పందించాలని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: