ఫిబ్రవరి 8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం  కేంద్ర హోంమంత్రి  అమిత్‌ షా ఢిల్లీలో ఓ ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు నిరసనకారులు పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలోని సీఏఏ మద్దతుదారులు కొందరు వారిని చితకబాదారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో అమిత్‌ షాపై బాలీవుడ్‌ దర్శకుడుఅనురాగ్‌ కశ్యప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అమిత్‌షాను జంతువుతో పోలుస్తూ తీవ్రమైన పదజాలం ఉపయోగించారు అనురాగ్ క‌శ్య‌ప్‌.  ‘మన హోంమంత్రి ఒక పిరికిపంద. పోలీసులను, గూండాలను ఆయన నియంత్రిస్తుంటారు. రోజురోజుకి తన భద్రత పెంచుకుంటూనే.. నిరసనకారులపై దాడులు చేయడానికి తన దళాలను వదులుతున్నారు. అమిత్‌ షా ప్రవర్తన నీచంగా ఉంటుంది. ఇలాంటి జంతువుపై చరిత్ర ఉమ్మేస్తుంది’ అని కశ్యప్‌ ట్వీట్‌ చేశారు. జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా గతంలో కూడా అనురాగ్‌ కేంద్ర సర్కారుపై విమర్శలు గుప్పించడం తెలిసిందే.

 

 

ఇదిలాఉండ‌గా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రజలు చేపడుతున్న నిరసనలకు సినీ, సాహిత్య తదితర రంగాలకు చెందిన దాదాపు 300 మంది ప్రముఖులు సంఘీభావాన్ని ప్రకటించారు. సీఏఏ, ఎన్నార్సీ భారత జాతి ఆత్మకు పెనుముప్పుగా మారిందని అభివర్ణిస్తూ వాళ్లు ఓ బహిరంగ ప్రకటన చేశారు. ఈ వివరాల్ని ఇండియన్‌ కల్చరల్‌ ఫోరవ్‌ు ప్రచురించింది. ప్రకటన చేసిన వారిలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా, సినీ నిర్మాత మీరానాయర్‌, గాయకుడు టీఎం కృష్ణ, రచయిత అమితావ్‌ ఘోష్‌, చరిత్రకారిణి రోమిలాథాపర్‌ తదితరులు ఉన్నారు. ‘సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విద్యార్థులకు, ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నాం. భారత రాజ్యాంగ సూత్రాల్ని రక్షించేందుకు వారు పరితపిస్తున్న విధానానికి వందనాలు చేస్తున్నాం. భారత జాతి ఆత్మకు సీఏఏ, ఎన్నార్సీ పెనుముప్పుగా మారాయి’ అని ప్రముఖులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: