ఫిబ్రవరి 8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా హోరాహోరీ ప్ర‌చారం జ‌రుగుతోంది. 70 స్థానాలు గల ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేయాల‌ని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. అయితే ఢిల్లీలో అసెంబ్లీ ఏర్పాటైన నాటి నుంచి పూర్వాంచల్‌ ఓటర్లే (తూర్పు ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌ వాసులు) పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తున్నారు.  70 నియోజకవర్గాల్లో  విస్తరించి ఉన్న పూర్వాంచల్‌ ఓటర్లు  ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. 

 

ఢిల్లీలోని 1.5 కోట్ల జనాభాలో పంజాబీలు, పూర్వాంచల్‌ వాసులు కలిపి సుమారు 70% మంది ఉంటారు.పూర్వాంచల్‌ ఓటర్ల మనస్సులు చూరగొనేందుకు ఆప్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ   మూడు పార్టీలు పోటీ పడుతుండటంతో వారి ఓట్లు చీలిపోతాయని భావిస్తున్నారు. అదే జరిగితే 35 శాతానికి పైగా ఉన్న పంజాబీ ఓటర్లు మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనల వల్ల 12% మంది ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని అభిప్రాయ పడుతున్నారు. 

 

ఇదిలాఉండ‌గా, కాంగ్రెస్- బీజేపీ పార్టీలు వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నాయి.  సినీ గాయకుడు మనోజ్‌ తివారీ రూపొందించిన మ్యూజిక్‌ ఆల్బంలు, బోజ్‌పురీ సినిమాల్లో పాడిన పాటలకు పూర్వాంచల్‌ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అందుకే 2016లో బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నియమించింది. బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా మనోజ్‌ తివారీని నియమించినప్పుడు సీనియర్ల నుంచి వ్యతిరేకత రాలేదు. దీంతో ఇప్ప‌టికీ ఆయ‌న్ను న‌మ్ముకునే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతోంది.

 

కాగా, బీజేపీకి పక్కలో బల్లెంలా మారిన మాజీ క్రికెటర్‌, మాజీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను ఢిల్లీ ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్‌గా కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. బీహార్‌లోని దర్భంగా స్థానం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన కీర్తి ఆజాద్‌ 2015 నుంచి బీజేపీపై ఘాటుగా స్పందిస్తున్నారు. పూర్వాంచల్‌ ఓట్లను తమవైపుకు తిప్పుకోవడంలో కీర్తి ఆజాద్‌ కీలకంగా వ్యవహరిస్తారని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: