ఢిల్లీ బీజేపీ నేతల ఎన్నికల ప్రచారం వివాదాస్పదమవుతోంది...! పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులను ఉద్దేశించి కమలనాథులు చేస్తున్న కామెంట్స్ ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ద్రోహులను కాల్చి పారేయండి అని ఓ కేంద్రమంత్రి అంటే... షహీన్ బాగ్ ఆందోళనకారులు మీ ఇళ్లల్లో దూరి అత్యాచారాలు చేస్తారంటూ మరో బీజేపీ నేత రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. వీటిపై ఈసీ విచారణ జరుపుతోంది. 

 

పర్వేష్ వర్మ... పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధుల తరపున ఈయన గారు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్ర బిందువైన షహీన్ బాగ్ గురించి గురించి ఈయన ఏమన్నారో ఒక్కసారి చదవండి. 

 

ఆందోళనకారులు మీ ఇళ్లల్లోకి చొరబడతారు, మీ అక్కలు, కూతుళ్లపై అత్యాచారం జరుపుతారు, చంపేస్తారు. అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి మోడీ, అమిత్ షా అక్కడుండరు...ఇదీ పర్వేష్ వర్మ అభిప్రాయం....ఈయనొక్కరే కాదు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు టప్పట్లు కొట్టి మరీ మద్దతు తెలిపారు...షహీన్ బాగ్ ఆందోళనకారులను ఉద్దేశించి దేశ ద్రోహులను కాల్చిపడేయాలన్న వ్యాఖ్యలకు జై కొట్టారు.

 

దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ అసహనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్, ఆప్ విమర్శిస్తున్నాయి. బీజేపీ మనస్తత్వం ఎలాంటిదో ఇలాంటి వ్యాఖ్యలతో తెలుస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. మరోవైపు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. నివేదిక ఇవ్వవాలని ఢిల్లీ ఎన్నికల ఈసీఓను ఆదేశించింది. మొత్తానికి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎవరికి వారు ప్రజలను ఆకట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక సమయంలో మాటలు మితిమీరి పోతుండటంతో ఆ పార్టీల అధిష్టానాలు తలలు పట్టుకుంటున్నాయి.  ఓటర్లకు గాలం వేసే పనిలో ఇలాంటి అనుకోని పరిణామాలు జరుగడంపై తెగ టెన్షన్ పడిపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: