టీఆరెస్ నాయకత్వానికి  అసమ్మతి గళాన్ని విన్పించారు మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి .  నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేయకపోయినా , ఆయన మంత్రి వర్గ సహచరుడి మాత్రం నాయిని ఏకిపారేశారు . కార్మిక , ఉపాధికల్పన శాఖ మంత్రిగా చామకూర మల్లారెడ్డి కొనసాగడం తాము చేసుకున్న పాపమని ఆవేదన వ్యక్తం చేశారు . తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగుల సంఘం నిర్వహించిన కార్యక్రమానికి హాజరయిన నాయిని కార్మిక మంత్రి , యాజమాన్యాలతో కుమ్మక్కై కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు .

 

ఇక రాష్ట్రం లో కార్మికులు సమ్మె చేసే పరిస్థితి కూడా లేదంటూ ఏకంగా కేసీఆర్ సర్కార్ ను ఇరుకున పడేసే వ్యాఖ్యలు చేశారు నాయిని .   నాయిని గత కొంతకాలంగా టీఆరెస్ నాయకత్వం పై , ముఖ్యమంత్రి కేసీఆర్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది .  ఇక మరో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , టీఆరెస్ కు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది . తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి తన అనుచరులను కొల్లాపూర్ మున్సిపాలిటీ లో పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఇండిపెండెంట్లుగా రంగం లోకి దించి మెజార్టీ సభ్యులను గెలిపించుకున్నారు . అయితే జూపల్లి వర్గానికి టీఆరెస్ నాయకత్వం షాక్ ఇచ్చింది . కో అప్షన్ సభ్యుల సహకారం తో మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాన్ని గెల్చుకుంది .

 

దీనితో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో కేసీఆర్ , కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం వేచి చూసిన జూపల్లి , ఇప్పుడు పార్టీ మారడంపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది . మున్సిపల్ ఎన్నికల్లో 95 శాతం సీట్లు గెల్చుకుని సంబరాల్లో మునిగి తెలుస్తోన్న టీఆరెస్ నాయకత్వానికి మాజీ మంత్రులు అదను చూసి షాక్ ఇచ్చేందుకు రెడీ గా ఉన్నట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: