తెలుగుదేశం పార్టీ నాయకుడు , మాజీమంత్రి గంటా  శ్రీనివాసరావు పార్టీ మారనున్నారని ప్రచారం జరిగినంతగా మరెవరి విషయంలోను జరగలేదు . దానికి కారణం లేకపోలేదు ... అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడే ఉంటారన్నది నానుడి . అయితే ఎన్నికలకు ముందే గంటా తో రాజకీయంగా విభేదించిన అవంతి శ్రీనివాస్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి , ఏకంగా కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు . ఇప్పుడు గంటా అధికార పార్టీ లో చేరినా పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు .

 

దాంతో గంటా తరుచూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ నాయకత్వానికి మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నారు . విశాఖ ను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని  విశాఖ వాసిగా స్వాగతిస్తున్నానని పేర్కొంటూ , మరోసారి సైలెంట్ గా బాంబు పేల్చారు . అయితే ఈ విషయం లో పార్టీ విధానం పార్టీదేనని , ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని చెప్పారు . గతంలోను గంటా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే . విశాఖ కు రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని , జగన్ తీసుకున్న నిర్ణయాన్ని విశాఖ వాసిగా స్వాగతిస్తున్నానని ట్విట్టర్ వేదికగా పేర్కొని అప్పట్లో సంచలనం సృష్టించారు .

 

విశాఖ ను రాజధాని గా ప్రకటించడాన్ని స్వాగతించిన గంటా , మండలి రద్దు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా ఆక్షేపించడం ద్వారా తానింకా టీడీపీ లోనే కొనసాగుతున్నానని చెప్పకనే చెప్పారు . మండలి లో మరో ఏడాది గడిస్తే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తుందన్న విషయాన్ని జగన్ విస్మరించినట్లు ఉన్నారని పేర్కొనడం ద్వారా తాను విమర్శిస్తున్నారో లేకపోతే  అధికార పార్టీ సలహా ఇస్తున్నారో తెలియని కన్ఫ్యూజన్ లో అందర్నీ  పడేశారు  గంటా .  

మరింత సమాచారం తెలుసుకోండి: