ఏపీలో జనసేన బిజెపి పార్టీలు పొత్తు పెట్టుకోవడం చాలామందికి ఆశ్చర్యం , అనుమానం కలిగించింది. క్షేత్ర స్థాయిలో బలం లేని ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల కలిసి వచ్చేది ఏమైనా ఉందా అని లెక్కలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్నాయని తెలిసినా ... ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నెగ్గుకు రావాలంటే, ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లడం ద్వారా అంతో ఇంతో ఫలితం ఉంటుందని ఆ పార్టీ అగ్ర నాయకులు భావిస్తున్నారు. జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో ఘోరంగా ఓటమి చెందడంతో ఆ పార్టీలో ఉన్న నాయకుల భవిష్యత్తు పై బెంగ పెరిగిపోయింది. 


పవన్ కూడా ఈ నాలుగున్నర ఏళ్లపాటు పోరాటాలు, ఉద్యమాలు, పార్టీ నిర్వహణ ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థికంగా కూడా ఇది పవన్ భరించలేనంత భారం. అలాగే జనసేన లో పవన్ తర్వాత ఆ స్థాయిలో వ్యూహాలు, ఎత్తుగడలు వేసే నాయకుల సంఖ్య అంతంత మాత్రమే. ఆ పార్టీ తరఫున ఏ విషయం మాట్లాడాలన్నా, ఏ  నిర్ణయం ప్రకటించాలన్నా, పవన్ ఒక్కరే స్పందిస్తూ ఉంటాడు. ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వాన్నిప్రశ్నించడం ఇవన్నీ పవన్ ఒక్కరు తప్ప మరొకరు ఆ పార్టీ నుంచి స్పందించరు. స్పందించే అవకాశం పవన్ ఇవ్వకపోయి ఉండవచ్చు. 


ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీకి నాయకులు ఉన్నా... క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చాలా తక్కువ. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో కూడా ప్రజాబలం ఉన్న నాయకులు పెద్దగా లేరు. బిజెపి తరఫున ఏపీలో ఏదైనా సమావేశం పెట్టినా, కనీసం వందమందిని పోగుచేయలేరు. ఇటువంటి నాయకులే ఎక్కువ సంఖ్యలో బీజేపీలో ఉన్నారు. ఈ సమయంలో ఏపీలో బలపడాలంటే ప్రజల్లో ఇమేజ్ ఉన్న పవన్ వంటి నాయకుల అవసరం బీజేపీకి ఉంది. అందుకే జనసేన తో పొత్తు పెట్టుకుని పవన్ ను బిజెపికి దగ్గర చేసుకుంది. పవన్ ద్వారా  ఏపీలో బలపడాలని బిజెపి ప్లాన్ చేస్తోంది. 


ఇక పవన్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించడం తన ఒక్కడి వల్ల కాదు అనే అభిప్రాయానికి వచ్చేయడంతో బిజెపి అండ తీసుకున్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో జనసేన మరింత బలోపేతం చేయడంతోపాటు, ఆర్థిక పరమైన చిక్కులు కూడా బిజెపి భుజాల మీద వేయవచ్చని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఒకరికొకరు ఎవరి అవసరాల కోసం వారు ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: