ఏపీ సీఎం జగన్ ఏం చేసినా తప్పు... ఏ పథకం అమలు చేసిన అందులో సూక్ష్మ లోపాలను ఎత్తి చూపిస్తూ తప్పులను వెతకడమే పనిగా పెట్టుకుని ఏదో ఒక వంకతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ .. రాజకీయంగా పై మెట్టు ఎక్కాలని భావిస్తూ ...దానిని అమలు చేయలేక, ప్రభుత్వంపై పోరాడే సామర్ధ్యం లేక సతమతమైపోతూ ఉండేవారు జనసేన పార్టీ అధినేత పవన్. ఇక రాజధానిగా అమరావతిని తరలిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా పవన్ దిగాడు.

 

జగన్ మూడు రాజధానులతో ఏపీ అభివృద్ధి చెందుతుందని, మూడు ప్రాంతాల ప్రజలకు సమాన న్యాయం జరుగుతుందని, రాజధాని అమరావతి నుంచి తప్పించడం లేదని జగన్ క్లారిటీ గా చెబుతున్నా పవన్ మాత్రం ఆందోళన తీవ్రతరం చేస్తూ రాజకీయంగా పై మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించాడు.


ఇక ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు మౌనంగానే ఉన్నా ..ఏపీ బీజేపీ నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఉండేవారు. అయితే జనసేన బిజెపి పొత్తు పెట్టుకున్న తర్వాత అమరావతిపై కలిసి ఉమ్మడిగా పోరాటం చేయాలని సమన్వయ కమిటీ సమావేశంలో తీర్మానించుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి రెండో తేదీన అమరావతి కి మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ ప్రకటన వాయిదా వేశారు. మళ్లీ లాంగ్ మార్చ్ ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంపై కనీసం స్పందించలేదు.

 

ఇక 15 రోజులకు ఒకసారి బిజెపి, జనసేన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అవుతుందని ముందుగానే ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఆ సమావేశం నిన్న జరిగింది. కానీ ఆ సమావేశంలో అంత సీరియస్ వ్యవహారాలపై చర్చ జరగలేదని తెలుస్తోంది. ఇక బిజెపి తరఫున కీలక నేతలు ఎవరు హాజరు కాలేదు. కేవలం పురందేశ్వరి, సోము వీర్రాజు సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. 


కనీసం ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇక జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శివ శంకర్, చంద్రశేఖర్ వంటి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అధికార పార్టీ వైసిపి, అలాగే ప్రతిపక్ష టిడిపి పార్టీలపై పోరాటం చేయాలని ఈ సమావేశంలో మొక్కుబడిగా ఓ అంగీకారానికి వచ్చారు. అయితే కీలకమైన అమరావతి విషయంలో ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభిస్తామని ముందుగా చెప్పిన బిజెపి, జనసేన పార్టీలు ఇప్పుడు మాత్రం ఈ సమావేశంలో కనీసం ప్రస్తావించలేదు. 


ఫిబ్రవరి రెండో తేదీన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ ను వాయిదా వేశారు. మళ్ళీ అది ఉండకపోవచ్చని చర్చ కూడా జరుగుతోంది. ఆ విషయాలపై కనీసం స్పందించేందుకు కూడా ఆ పార్టీ నేతలు ఇష్టపడడం లేదు. దీనిని బట్టి ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నీ కేంద్రం అనుమతితోనే జరుగుతున్నాయనే విషయం అర్థం అవుతోంది. అందుకే ఇప్పుడు జనసేన కానీ, బీజేపీ నేతలు కానీ అమరావతి తో పాటు మిగతా విషయాల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలపై అంత గట్టిగా స్పందించలేక పోతున్నారని తెలుస్తోంది. అంటే పరోక్షంగా జగన్ నిర్ణయాలకు వీరంతా మద్దతు పలుకుతున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: