ఏపీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 54 లక్షల మంది పేదలకు మేలు చేకూరుస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు ప్రకటన చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 39 లక్షల మంది మాత్రమే పింఛన్లకు అర్హులుగా ఉన్నారని ఇప్పుడు 54.64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వనుందని తెలిపారు. 15.64 లక్షల మందికి కొత్తగా ప్రయోజనం కలగనున్నట్టు సీఎం జగన్ చెప్పారు. 
 
గ్రామ, వార్డ్ వాలంటీర్లు పెన్షన్ సొమ్మును అర్హుల ఇంటి దగ్గరకు వచ్చి పంపిణీ చేస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో ఎక్కువగా పెన్షన్లు, ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. స్పందనలో అధికారుల పనితీరు బాగుందని సీఎం జగన్ ప్రశంసించారు. నిన్న సీఎం జగన్ సచివాలయం నుండి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 
 
ఫిబ్రవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 21వ తేదీ వరకు కొత్తగా రేషన్ కార్డులకు, పెన్షన్ కు అర్హులైన వారికి రేషన్, పెన్షన్ కార్డులను అందజేయాలని సూచించారు. ఫిబ్రవరి 2వ తేదీలోపు సామాజిక తనిఖీ పూర్తి కావాలని వెంటనే కార్డుల పంపిణీ చేపట్టాలని అర్హులెవరైనా మిగిలిపోయి ఉంటే కొత్త కార్డుల మంజూరు గ్రామ సచివాలయాల ద్వారా చేయాలని సీఎం జగన్ సూచనలు చేశారు. 
 
ఫిబ్రవరి 15వ తేదీలోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితా పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఇళ్ల పట్టాల మంజూరుకు, ప్రజా సాధికారిక సర్వేకు ముడి పెట్టకూడదని చెప్పారు. మొక్కుబడిగా ఇళ్ల స్థలాలను ఇవ్వకూడదని ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలాలకు మెజారిటీ లబ్ధిదారులు అంగీకారం తెలపాలని సీఎం జగన్ అన్నారు. మార్చి 1వ తేదీలోపు ఇళ్ల స్థలాలకు భూసేకరణ పూర్తి కావాలని మార్చి 10వ తేదీలోపు స్థలాల్లో ఫ్లాట్ల అభివృద్ధి చేయాలని మార్చి 15వ తేదీలోపు లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసి ఫ్లాట్ల కేటాయింపులు చేయాలని సీఎం జగన్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: