ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న వసతి దీవెన పథకం అమలుకు రంగం సిద్ధమైంది. సీఎం జగన్ నిన్న సచివాలయం నుండి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం జగన్ జగనన్న వసతి దీవెన పథకం అమలు గురించి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు సంవత్సరానికి 10,000 రూపాయల నగదు ప్రభుత్వం జమ చేయనుంది. 
 
పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ విద్యార్థులకు 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేయనుంది. అర్హులైన విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలలో రెండు విడతలుగా ఈ నగదు జమ కానుంది. దాదాపు 11.60 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీ నుండి రాష్ట్రంలో ఈ పథకం అమలు కానుంది. 
 
రెండు విడతలుగా జమ చేయనున్న నగదులో మొదటి విడత నగదు ఫిబ్రవరిలో 20వ తేదీ తరువాత జమ కానుంది. రెండో విడత డబ్బులు జులై - ఆగష్టులో జమ కానున్నాయని సమాచారం. ఈ పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి అని ప్రభుత్వం నిబంధనలలో పేర్కొంది. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందినవారికి, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు, దూరవిద్య, కరెస్పాండెన్స్ లో చదివే వారికి ఈ పథకం వర్తించదని సమాచారం. 
 
బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ డబ్బులను ఖాతాలో జమ చేయనుంది. సీఎం జగన్ గతంలో ఇంటర్మీడియట్ తరువాత కేవలం 23 శాతం మాత్రమే హైయర్ స్టడీస్ చదువుతున్నారని హైయర్ స్టడీస్ చదివే విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఈ పథకం అమలు చేయనున్నామని జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రభుత్వం హాస్టల్, భోజనం, ఖర్చులను కూడా భరిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం 2,300 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. విద్యార్థులకు మెరుగైన వసతులు అందించాలంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు చేయాల్సిందేనని ప్రభుత్వం భావించడంతో పాటు ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకు సాగుతోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: