కొత్త ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జెట్ ను తీసుకొనిరావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 - 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల బడ్జెట్ తమ లక్ష్యమని ప్రకటన చేయగా ఆ స్థాయిలో సంపద వృద్ధి మాత్రం జరగటం లేదు. సంపద వృద్ధి ఆ స్థాయిలో జరగకపోవడంతో ప్రధాని మోదీ కలలు, కోరికలు నెరవేరుతాయా...? లేదా..? అనే ప్రశ్నలు మెదులుతున్నాయి. 
 
ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశపెడతారా...? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గడచిన ఐదేళ్ల మోదీ పదవీకాలంలో జీడీపీ సగటు వార్షిక వృద్ధి రేటు 7.5 శాతం మాత్రమే సాధించగలిగింది. మోదీ 2016 సంవత్సరంలో పెద్ద నోట్ల రద్దు అనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
నోట్లరద్దు సంచలన నిర్ణయం తరువాత జీడీపీ వార్షిక వృద్ధిరేటు 8.2 నుండి 6.8 కి పడిపోయింది. ప్రభుత్వం పన్నులను పెంచటం ద్వారా లక్ష్యాలను సాధించాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. జులై - సెప్టెంబర్ మధ్య కాలంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు ఏకంగా 4.5 శాతానికి పడిపోయింది. మోదీ ప్రధానంగా మధ్య తరగతి ప్రజలకు, ఉద్యోగులకు మేలు చేకూరే విధంగా బడ్జెట్ ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
కేంద్రం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రధానంగా ఎయిరిండియా వాటాలను విక్రయించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లోను వాటాలను విక్రయించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులకు సుంకం పెంచి ఆర్థిక భారాన్ని తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండనుందని తెలుస్తోంది. మరి మోదీ కలలు నెరవేరే స్థాయికి సంపద వృద్ధి జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: