ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా చూడటం మొదలుపెట్టింది. గత ఐదేళ్లు టీడీపీ-బీజేపీలు కలిసి ఉన్న ఏపీకి పెద్దగా నిధులు వరదలు వచ్చిన దాఖలాలు లేవు. కేంద్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో ఉండటంతో అనుకున్న విధంగా రాష్ట్రానికి నిధులు రాలేదు. 2019లో రెండోసారి కూడా బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇటు ఏపీలో వైసీపీ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి పార్టీల మధ్య పొత్తులు లేవు. కానీ వైసీపీ ప్రభుత్వం బీజేపీతో సఖ్యతతోనే ఉంటుంది.

 

ఈ క్రమంలో రాష్ట్రానికి కేంద్ర సాయం ఎలాంటి సాయం రానుందనే విషయం ఫిబ్రవరి 1న తేలిపోనుంది. తెలుగింటి కోడలు, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్ర‌వ‌రి 1న 2020 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై రాష్ట్రం చాలానే ఆశ‌లు పెట్టుకుంది. కొత్తగా మూడు రాజధానులు తెరపైకి రావడం, రాష్ట్రంలో పథకాలకు నిధులు ఎక్కువ ఖర్చు కావడం, విభజన హామీలు పెండింగ్‌లో ఉండటం, కేంద్రానికి సంబంధించిన విద్యాసంస్థలకు నిధులు రావడం ఇలాంటివి చాలానే అంశాలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఏ మేరకు బడ్జెట్‌లో రాష్ట్రానికి సాయం ప్రకటిస్తుందో తెలియాల్సి ఉంది.

 

2019లో వచ్చిన బడ్జెట్‌లో కూడా కేంద్రం ఏపీకి ప్రకటించిన తాయిలాలు ఏం లేవు. ప్రత్యేకహోదా పక్కనబెట్టి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధులపై కేంద్రం నుంచి స్పందన లేదు. రాజధాని అమరావతి, దుగరాజు పట్నం, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటి ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు. అప్పుడు కేవలం విద్యాసంస్థల్లో కేవలం మూడింటికే నిధులు కేటాయించింది. కేంద్రియ విద్యాలయానికి రూ.13 కోట్లు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.31.82 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గిరిజన యూనివర్సిటి కోసం ఉమ్మడిగా రూ.8 కోట్లు కేటాయించారు. ఇక బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలని కోరిన ఇవ్వలేదు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఏమేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆశ‌ల‌ను కేంద్ర బడ్జెట్ నెర‌వేర్చ‌నుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: