రాజధాని ప్రాంతంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయ వాడకు మెట్రో రైలును తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత‌ నారా చంద్ర‌బాబుగారు అనుకున్నారు. ఈయ‌న‌ ఆలోచనలకు అనుగుణంగా విజయవాడతోపాటు రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ) ఏర్పడింది. మీడియం మెట్రో వచ్చేసిందన్నారు. భూసేకరణకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. అది కాస్తా రద్దయింది. అనంతరం లైట్‌ మెట్రో తెరమీదకు వచ్చింది. ఇలా గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌క‌ట‌న‌ల‌తోనే ముగిసింది. 

 

మెట్రోరైలు భూమికీ ఆకాశానికి మధ్య హాయిగా సాగిపోయే అద్భుతమైన ప్రయాణం అన‌డంలో సందేహం లేదు. ఈ నేప‌థ్యంలోనే హైదరాబాద్ లో మెట్రో పరుగులు పెడుతోంది. విభజన హామీల ప్రకారం ఏపీకి కూడా మెట్రో కేటాయించారు. కానీ ఆప్రాజెక్టు ఇంకా మీనమేషాలు లెక్కించే దశలోనే ఉంది. నవ్యాంధ్ర రాజధానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైల్‌ ప్రాజెక్టు భవితవ్యంపై ఓ స్ప‌ష్టత అయితే రావ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఇక రాష్ట్ర విభజన చట్టం నిర్దేశించిన మేరకు ఏర్పాటు చేయాల్సిన మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి నూతన ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారుంది. 

 

లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళతారా.. మీడియం మెట్రో ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తారా? మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి పీపీపీ విధానంలో వెళ్ళాలా? మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి పంపుతారా లేక ఏమైనా మార్పులకు నిర్దేశిస్తారా? అన్న ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌చ్చాయి.  అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం బ‌డ్జెట్ 2020లో  విజ‌య‌వాడ మెట్రోకి చోటు లేన‌ట్టేగా తెలుస్తోంది. అవును! విజ‌య‌వాడ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించ‌లేదు. ఈ బ‌డ్జెట్‌లో అయినా నిధులు కేటాయించాల‌ని ప్ర‌భుత్వం గ‌తంలో కోరింది. అయితే, ఇప్పుడు మారిన ప్ర‌ణాళికా స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో బ‌డ్జెట్‌లో ఈ మెట్రోకి చోటు లేన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: