పొరుగుదేశ‌మైన పాకిస్థాన్‌లో హిందువులపై దాడులు తగ్గడం లేదు. ఇటీవలే ఓ హిందూ బాలికను అపహరించి బలవంతంగా ఇస్లాంలోకి మార్చి వివాహం చేసుకున్న ఘటన మరువకముందే.. సింధ్‌ రాష్ట్రంలో అలాంటి ఘటనే జరిగింది. పాక్‌ జనాభాలో హిందువులు రెండుశాతం ఉండగా, ప్రధానంగా సింధ్‌ ప్రాంతంలోనే ఉన్నారు. ఇక్కడ బలవంతపు మతమార్పిడిలు ఎక్కువగా జరిగినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఈ నెలలోనే ఇలాంటి ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. మాటియారి జిల్లాలోని హల పట్టణంలో కిశోర్‌ దాస్‌ అనే వక్తి తన కుమార్తె భారతి బాయి (24)కి పెళ్లి చేస్తుండగా.. సాయుధు లైన దుండగులు ప్రవేశించి ఆమెను పెళ్లి పీటల మీది నుంచి ఎత్తుకెళ్లారు.

 


ఆల్‌ పాకిస్థాన్‌ హిందూ కౌన్సిల్‌ (ఏపీహెచ్‌సీ) ఈ సంఘ‌ట‌న‌పై స్పందిస్తూ.... భారతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని, తర్వాత షారుఖ్‌ గుల్‌ అనే ముస్లిం యువకుడితో పెళ్లి జరిపించారని ఆరోపించారు. దుండగుల్లో కొందరు పోలీసు దుస్తుల్లో కూడా ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, భారతి గత ఏడాది డిసెంబర్‌లో బనోరి పట్టణంలోని జమియత్‌ ఉల్‌ ఉలూం ఇస్లామియా వద్ద ఇస్లాంలోకి మారిందని, బుష్రాగా పేరు మార్చుకున్నదని షారుక్‌ గుల్‌ పేర్కొన్నాడు. సంబంధిత పత్రాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అయితే, దీనిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ మేరకు భారతి ఆయా తేదీల్లో బనోరి పట్టణంలో పర్యటించిందా? లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సింధ్‌ మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి హరిరాం కిశోర్‌ విచారణకు ఆదేశించారు. 

 

 

ఇదిలాఉండ‌గా, హిందువులు అధికంగా ఉండే సింధ్‌ రాష్ట్రంలో మ‌రో క‌ల‌క‌లం రేగింది. ఛాచ్రో పట్టణ శివారు గ్రామంలో ఉన్న ఓ దేవాలయంపై దాడిచేసిన నలుగురు మైనర్లను పోలీసులు అరెస్ట్‌చేశారు. వారంతా 12-15 ఏళ్ల‌ మధ్య వయసువారే నని చెప్పారు. వారు ఆదివారం రాత్రి మాతా రాణి దేవల్‌ భిట్టానీ దేవాలయంలోకి చొరబడి విధ్వంసానికి దిగడంతోపాటు దేవతా విగ్రహాలను అపవిత్రం చేశారు. దీంతో నిందితులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. దేవాలయం నుంచి డబ్బు దొంగిలించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్టు చెప్పారు. ఛాచ్రో పోలీస్‌ స్టేషన్‌ అధికారి హుస్సేన్‌ బక్స్‌ రాజర్‌ దేవాలయాన్ని సందర్శించారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నెలకొన్న మత సామరస్యానికి అంతరాయం కలిగించే లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని సింధ్‌ మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి హరిరాం కిశోర్ తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: