గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల‌పై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఓ వైపు ప‌న్నుల భారం విష‌యంలో సామాన్యులు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తుండ‌గా....మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం అంతే ఆస‌క్తి త‌మ‌కు ఏం కేటాయిస్తార‌ని నిరీక్షిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావుతోపాటు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై పోరాడాలని నిర్ణయించారు. జీఎస్టీ బకాయిలు, విభజన హామీల అమలు, రైల్వే, రహదారులు, రిజర్వేషన్ల బిల్లులు సహా పలు సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించాలని నిశ్చయించారు. 


తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలని కేటీఆర్ సూచించారు. వివిధ పథకాలకు ఆర్థికసహాయం చేయాలని నీతిఆయోగ్‌ ప్రతిపాదించినప్పటికీ, రాష్ట్రానికి ఇప్పటిదాకా కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాని విషయాన్ని ప్రస్తావించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాల స్ఫూర్తిగా కేంద్రం పలు కార్యక్రమాలు చేపట్టిందని, రైతుబంధు, రైతుబీమా, తెలంగాణకు హరితహారం, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను పార్లమెంట్‌ సమావేశాల్లో వివరించాలని చెప్పారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టినా నయాపైసా కూడా ప్రత్యేక నిధులు కేటాయించని కేంద్రం తీరును ఎండగట్టాలని సూచించారు. రాష్ట్రం తరఫున కేంద్రానికి ఇప్పటికే వినతులు చేసిన ఐఐఎం, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు, నేషనల్‌ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి సంస్థలకు కేటాయింపుల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశించారు.

 


కాగా, సీఏఏ, ఎన్నార్సీ వంటి వాటిపైన సీఎం కేసీఆర్‌ తీసుకొన్న వైఖరి మేరకు వ్యవహరించాలని సూచించారు. దేశం సంక్లిష్ట పరిస్థితిలోకి దిగజారుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సమస్యగా మారిన నిరుద్యోగిత, ఆర్థికవ్యవస్థలో అస్థిరతవంటి కీలకమైన ప్రజోపయోగ అంశాలపైన కేంద్రం ఫోకస్‌చేయాలని..  ప్రజలకు అవసరంలేని సీఏఏ, ఎన్నార్సీ వంటి రాజకీయపరమైన అంశాలను పక్కన పెట్టాలని కేంద్రానికి సూచించాలన్నారు. అనంత‌రం రాష్ట్రాకి రావాల్సిన నిధులు, రాష్ట్ర విభజనచట్టంలోని హామీలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీపార్టీ నిర్ణయించింది. తెలంగాణకు దక్కాల్సిన నిధులు, దీర్ఘకాల డిమాండ్లు, ప్రాజెక్టుల కేటాయింపులకు సంబంధించి ఒత్తిడి పెంచాలని తీర్మానించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: