సీఎం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. దర్యాప్తు జరుగుతున్న తీరు మీద తమకు అనుమానాలున్నాయని వివేకా కుమార్తె సునీత అంటున్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆమె గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు.. హత్య కేసులో తనకు అనుమానం ఉన్న వారి వివరాలను ఆమె కోర్టుకు సమర్పించారు.

 

కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులను మార్చడం, కడపకు కొత్త ఎస్పీ వచ్చాక కేసు నత్తనడకన సాగడం లాంటి పరిణామాలు చూస్తుంటే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయంటున్నారామె. ఈ కేసులో అమాయకులను ఇరికించి అసలైన నేరస్థులను వదిలేస్తారేమో అనే సందేహం కలుగుతోందని ఆమె కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

 

అయితే ఆమె అనుమానం వ్యక్తం చేసిన పేర్లలో వైఎస్ కుటుంబీకుల పేర్లు కూడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సునీత మొత్తం 15 మందిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో ముగ్గురు వైఎస్ కుటుంబీకుల పేర్లు ఉండటం విశేషం. వారి వివరాలు ఇవీ.. వారిలో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఒకరు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయాక భాస్కర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రతిపాదించింది. దీన్ని వివేకానందరెడ్డి వ్యతిరేకించారు.

 

మరొకరు వైఎస్‌ మనోహర్‌రెడ్డి.. బాత్రూం, బెడ్రూంలలోని రక్తపుమరకలను శుభ్రం చేయమని మనోహర్‌రెడ్డి తనకు చెప్పారంటూ యర్ర గంగిరెడ్డి పోలీసులకు చెప్పారు. సునీత జైల్లో కలిసినా ఇదే విషయాన్ని చెప్పారు. మరో పేరు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిది. అవినాష్ రెడ్డి ఘటనా స్థలానికి ఉదయం 6గంటలకే చేరుకున్న మొదటి కుటుంబసభ్యుడు.

 

గదులను శుభ్రం చేసేటపుడు అక్కడకు సమీపంలో ఉన్నారు. శంకర్‌ను రక్షించడానికి అవినాష్‌ ప్రయత్నిస్తున్నారని సునీత అనుమానిస్తున్నారు. కడప ఎంపీగా అధికారులపై ప్రభావం చూపగలరని ఆమె అంటున్నారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: