మ‌న‌దేశంపై మ‌రో ఊహించ‌ని టార్గెట్‌. దేశంలోని అంత‌ర్గ‌త విష‌యంలో... వివిధ దేశాల కూట‌మి వేలు పెడుతోంది. భార‌త్ స్వ‌తంత్రాన్ని ప్ర‌శ్నించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అదే యురోపియన్‌ యూనియన్‌. ఐరోపాలోని 28 దేశాల కూటమే ఈయూ. దీనికి అధ్యక్షుడు నేతృత్వం వహిస్తారు. ఈయూలో మొత్తం ఎనిమిది విభాగాలు ఉన్నాయి. ఇందులో పార్లమెంట్‌ ఒకటి. సభ్యదేశాల నుంచి ఎన్నికైన 751 మంది ఎంపీలు ఇందులో ఉంటారు. వీరు వివిధ అంశాలపై చర్చించి, తీర్మానాలు జారీ చేస్తారు. అయితే విదేశాంగ విధానం, భద్రతకు సంబంధించి తుది నిర్ణయం మాత్రం యురోపియన్‌ కౌన్సిల్‌ చేతుల్లో ఉంటుంది. సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) యురోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌(ఈపీ)లో బుధవారం చర్చ, గురువారం ఓటింగ్‌ జరుగనుంది. 

 

 

యురోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌(ఈపీ)లోని ఆరు పార్టీలు పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ)పై  వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. వాటిలో ఐదు వ్యతిరేకంగా, ఒకటి అనుకూలంగా ఉన్నాయి. అయితే అన్ని పార్టీలూ సీఏఏ నిరసనకారులపై జరుగుతున్న హింసను ఖండించాయి. ఈపీలోని మొత్తం 751 మంది సభ్యులకుగానూ 626 మంది సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీ అయిన ‘యురోపియన్‌ పీపుల్స్‌ పార్టీ’(ఈపీపీ).. సీఏఏతో భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముందని పేర్కొంది. ఈ చట్టంతో భారత్‌లో అంతర్గతంగా అస్థిరత నెలకొనడంతోపాటు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించింది. రెండో అతిపెద్ద పార్టీ ‘సోషలిస్ట్స్‌ అండ్‌ డెమోక్రాట్స్‌ గ్రూప్‌' సీఏఏను ప్రమాదకారిగా, విభజనకారిగా అభివర్ణించింది. ద రెన్యూ యూరప్‌ గ్రూప్‌, ద వెర్ట్స్‌/ఏఎల్‌ఈ గ్రూప్‌, ద జీయూఈ/ఎన్‌జీఎల్‌ గ్రూప్‌ సైతం సీఏఏను వ్యతిరేకించాయి. సీఏఏలో పాక్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ను మాత్రమే చేర్చడం, భూటాన్‌, శ్రీలంక, మయన్మార్‌ వంటి మిగతా పొరుగుదేశాలను విస్మరించడాన్ని వ్యతిరేకించాయి. ద యురోపియన్‌ కన్జర్వేటివ్స్‌ అండ్‌ రిఫార్మిస్ట్స్‌ గ్రూప్‌ మాత్రం సీఏఏకు మద్దతుగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇలాంటి చట్టాలు చేయడానికి భారత్‌కు సార్వభౌమాధికారం ఉందని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

 

ఇదిలాఉండ‌గా,  గురించి భారత్‌ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విదేశాంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఈపీ తీర్మానం చేసినా పెద్దగా ప్రభావం ఉండదని, ఈ అంశంపై తుది నిర్ణయాధికారం ఈయూ కౌన్సిల్‌కు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. కౌన్సిల్‌ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించకపోవచ్చన్నారు. తీర్మానాన్ని పరిశీలన కోసం ఈయూ కౌన్సిల్‌కు మాత్రమే పంపుతుందని, అంతకుమించి అధికారాలు లేవని తెలిపారు. ఈయూ సాధారణంగా తన కూటమికి చెందని దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా వ్యాపార, వాణిజ్య పరంగా ఈయూకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న నేపథ్యంలో భారత్‌తో సఖ్యతనే కోరుకుంటుందని చెబుతున్నారు. కాగా, ఈపీ నిర్ణయంపై భారత్‌ ఘాటుగా స్పందించింది. సీఏఏ తమ అంతర్గత వ్యవహారమని, ఇతరుల జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా, ఈయూలోని పలు సభ్యదేశాలు సీఏఏను భారత అంతర్గత విషయంగా పేర్కొంటున్నాయి.   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: