ఎయిర్ ఇండియా కథ కంచికి చేరనుంది. అప్పులతో మునిగిపోయి ప్రభుత్వానికి భారంగా మారుతున్న ఎయిరిండియాలో 100 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని బడ్జెట్ సమావేశాల్లో తీసుకొనున్నారు. పూర్తిగా అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియా వాటాలని 100 శాతం అమ్మేస్తే, ఆ సంస్థ ఇంకా ప్రైవేట్ పరం అయిపోనుంది.

 

కాగా, ఎయిర్ ఇండియాలోని కొంత వాటాని అమ్మాలని, 2018లో బిడ్‌ల‌కు ఆహ్వానం ప‌లికినా, ఆ సంస్థలో వాటాను కొనేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. వాటాను కొనుగోలు చేయాలనుకునే వారికి మార్చి 17వ తేదీ వ‌ర‌కు గడువు విధించారు. ఇక ఎయిర్ ఇండియాని కొనుగోలు చేసేందుకు హిందూజా, టాటా గ్రూప్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌ లాంటి బడా సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలిసింది.

 

ఇదిలా ఉంటే అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి, దేశీయ సంస్థల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లకు 51 శాతం వాటా ఉంది. ఎయిరిండియా 57 జాతీయ, 45 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలు నడుపుతోంది. కాకపోతే ఎయిర్ ఇండియా విమాన ప్రయాణ ఖర్చు దేశీయ సంస్థలతో సమానంగా, అంతర్జాతీయ విమానయానసంస్థలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఎయిర్‌ ఇండియా అనేది అతి బ్రాండ్ నేమ్. పైగా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు కలిపి 146 విమానాలు ఉన్నాయి. ఈ రెండిటికి కలిపి విమానయాన సంస్థల్లో 18.6 శాతం మార్కెట్ వాటా ఉంది.  అలాగే 4,486 దేశీయ, 2,738 అంతర్జాతీయ స్లాట్లు ఉన్నాయి.

 

2018-19 సంవత్సరానికి ఎయిర్‌ ఇండియా రూ.8,556.35కోట్లు నష్ట పోయింది. ప్రస్తుతం రూ.60,074 కోట్లు అప్పులతో ఎయిర్‌ ఇండియా ఇబ్బందుల్లో ఉంది. ఇలా అప్పులతో సతమవుతున్న నేపథ్యంలోనే కేంద్రం 100 శాతం వాటాలని అమ్మకానికి పెట్టేసింది. అయితే ఈ అప్పుల్లో రూ.23,286.50 కోట్ల రుణ భారం ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లపైనే ఉండనుంది. మిగతా భారాన్ని ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేస్తారు. మొత్తానికైతే ఎయిర్ ఇండియా మరికొన్ని రోజుల్లో ప్రైవేట్ పరం కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: