జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా కర్నూలులో  హై కోర్టు ఏర్పాటైతే అందుకు అవసరమైన నిధులు కేంద్రంప్రభుత్వం అందిస్తుందా ?  ఇపుడిదే అంశం ప్రభుత్వంలోని పెద్దలను పట్టి పీడిస్తోంది. ఎందుకంటే అమరావతిలో హై కోర్టు నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చేసింది.  సరే ఆ నిధులను చంద్రబాబు ఎంత సవ్యంగా ఖర్చు చేశారో అందరికీ తెలిసిందే. చిన్నపాటి వర్షానికి కూడా హైకోర్టు భవనం లోపలంతా కురవటమే. భవనం నాణ్యతపై చీఫ్ జస్టిస్ తో పాటు ఇతర జడ్జీలు కూడా మండిపోతున్నారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హైకోర్టు తరలింపు అన్నది రాష్ట్రప్రభుత్వం పరిధిలోనిది కాదు. రాష్ట్రప్రభుత్వం కేవలం ప్రతిపాదన మాత్రమే చేయగలదు. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రింకోర్టు కొలీజియమే.  సుప్రింకోర్టు కొలీజియం ఓకే అంటే అందుకు అవసరమైన నిధులను కేంద్రప్రభుత్వం కేటాయిస్తుంది.

 

పైన చెప్పుకున్నది మామూలుగా జరిగే ప్రొసీజర్. సుప్రింకోర్టు కొలీజియం సమ్మతితోనే చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి హై కోర్టును అమరావతికి తరలించారు.  విభజన చట్టం ప్రకారం హై కోర్టు ఏర్పాటుకయ్యే మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలి. చంద్రబాబు ప్రతిపాదనల ప్రకారం కేంద్రం నిధులు కూడా ఇచ్చేసింది. నిజానికి చంద్రబాబు కట్టింది  నాసిరకం, తాత్కాలిక హైకోర్టు మాత్రమే.

 

సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.  ఇందుకు అవసరమైన అనుమతులను సుప్రింకోర్టు నుండి తీసుకోవాలి. ఆల్రెడీ హైకోర్టు అమరావతిలో పనిచేస్తోంది. కాబట్టి ఇప్పటికే అమరావతిలో పనిచేస్తున్న హై కోర్టును కర్నూలుకు తరలించాల్సిన అవసరం ఏమిటని సుప్రింకోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వం ఏమని సమాధానిమిస్తుంది ?

 

రాజకీయంగా చంద్రబాబునో లేకపోతే ఇతర పార్టీల నోళ్ళు మూయించినట్లు ఎదురుదాడి చేస్తే పని జరగదు. కర్నూలులో హై కోర్టు ఏర్పాటు అవసరాన్ని జగన్ చెప్పాల్సుంటుంది. సుప్రింకోర్టు కొలీజియం కన్వీన్సవుతుందా ? లేదా ? అన్నది వేరే విషయం. అలాగే ఇప్పటికే హై కోర్టు ఏర్పాటుకు నిధులు ఇచ్చేసిన కారణంగా మళ్ళీ రెండోసారి నిధులు ఇచ్చే అవకాశం దాదాపు ఉండదు. కాబట్టి సుప్రింకోర్టు అంగీకరించినా కర్నూలుకు తరలించటానికి, ఎస్టాబ్లిష్ అవ్వటానికయ్యే మొత్తం ఖర్చును రాష్ట్రప్రభుత్వమే భరించాల్సుంటుందని బిజెపి నేతలంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: