దేశ ఆర్ధిక పరిస్ధితి నానాటికి దిగజారిపోతున్న సమయంలో  బడ్జెట్-2020 ప్రవేశపెట్టటానికి కేంద్రప్రభుత్వం రెడీ అయిపోతోంది.  పెద్దనోట్ల రద్దు తర్వాత దేశ ఆర్ధిక రంగమే పెద్ద సంక్షోభంలో కూరుకుపోయిందనే చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు సమయంలో నరేంద్రమోడి గంభీరంగా ఇచ్చిన ఉపన్యాసాలు, చెప్పిన కారణాలు అన్నీ సొల్లే అని ఆ తర్వాత జరిగిన పరిణామాలు నిరూపించాయి. అదే సమయంలో  నోట్లరద్దు వల్ల దేశ ఆర్ధిక రంగం ఎంతగా అవస్తలు పడుతోందో రిజర్వ్ బ్యాంకు కూడా లెక్కలతో సహా చెప్పటం గమనార్హం.

 

సరే అదంతా గతమని అనుకున్నా దాని తాలూకు పీడకలలు దేశాన్ని పట్టి ఇంకా పీడిస్తోందనటానికి  తాజా ఆర్ధిక పరిస్ధితే ఉదాహరణ.  మరో రెండు రోజుల్లో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ మోడి సామర్ధ్యానికి పెద్ద సవాలే విసురుతోందనటంలో సందేహం లేదు. ఆర్ధికమాంద్యం ప్రభావం దేశంలో నిర్మాణ, ఉత్పత్తి, పారిశ్రామిక, ఆటోమొబైల్, స్ధిరాస్తి రంగాలపై పెద్ద ప్రభావమే చూపింది. ఈ కారణంగానే పన్ను వసూళ్ళ లక్ష్యాలను చేరుకోవటంలో కేంద్రం ఫెయిలయ్యిందని చెప్పాలి.

 

వస్తువులకు డిమాండ్ బాగా తగ్గిపోవటానికి కారణం మధ్య తరగతి జనాల చేతుల్లో డబ్బులాడకపోవటమే.  ఆదాయపు పన్ను పరిమితిని పెంచటమే సరైన పరిష్కారం. ఎందుకంటే కోట్లలో ఉన్న మధ్య తరగతి జీవుల్లో ఉద్యోగులే అధికంగా ఉంటారు. కాబట్టి వీళ్ళ జీతాల్లో నుండే ట్యాక్సులు పట్టేస్తారు. కాబట్టి  ఆదాయపు పన్ను పరిమితి పెంచితే  జనాల చేతుల్లో కాస్త డబ్బు మిగులుతుంది. ఆ మిగిలే డబ్బు మార్కెట్లోకి వస్తుంది. రూ. 10 లక్షల వ్యక్తిగత ఆదాయం ఉన్నవారికి మరింత రాయితీలు ఇవ్వాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

 

దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే వ్యవసాయ రంగంలో అభివృద్ధి పెద్దగా లేదనే చెప్పాలి. వ్యవసాయాదాయం పడిపోతున్న కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.  కాబట్టి రైతన్నల కోసం ఎన్ని రాయితీలిచ్చిన తక్కువే. కాబట్టి వాళ్ళపై కేంద్రం కనికరం చూపిస్తుందేమో చూడాలి. ప్రభుత్వానికి వచ్చే వసూళ్ళలో కోత పడుతుండటంతో చేస్తున్న ఖర్చుల్లో కూడా కోత పడుతోంది. ఫలితంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్ధిక సంబంధాలపై ప్రభావం పడుతోంది.

 

 అదే సమయంలో ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతోంది. 2019 ఆగస్టులో 3 శాతం ఉన్న ద్రవ్యోల్బణం నవంబర్ కు 10 శాతం డిసెంబర్ కు 15 శాతానికి పెరిగిపోవటం గమనార్హం. దీని ఫలితంగా కూరగాయలు, పప్పులు, ఉల్లిపాయలు, నూనెల్లాంటి అన్నీ ధరలు పెరిగిపోతున్నాయి.  వీటిని తగ్గించకపోతే ముందు ముందు చాలా ప్రభావం పడుతుందనటంలో సందేహం లేదు.

 

నిరుద్యోగం పెరిగిపోతోంది, ద్రవ్యలోటూ పెరిగిపోతోంది. విదేశీ పెట్టుబడులు ఆశించినంతగా  రాలేదు. గడచిన 45 ఏళ్ళల్లో ఎన్నడూ లేనంత స్ధాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది. విదేశీ పెట్టుబడులు 55 బిలియిన్ డాలర్ల దగ్గరే ఆగిపోయింది. ఇలా ఏ రంగంలో చూసుకున్నా తిరోగమనమే కానీ అభివృద్ధి కనిపించటం లేదు. మొత్తానికి రానున్న బడ్జెట్ మోడి సామర్ధ్యానికి పెద్ద పరీక్షనే చెప్పాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: