ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత, ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తూ వచ్చిన దుగరాజపట్నం ఓడ రేవు నిర్మాణాన్ని కేంద్రప్రభుత్వం తన ప్రాధాన్యతల నుంచి కొట్టిపడేసిందన్న విషయం తెలిసిందే.. భారీ ఓడరేవు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన దుగరాజపట్నం.. అనువైన ప్రదేశంకాదని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్షుఖ్‌ మండావీయ స్పష్టం చేశారు కూడా.. ఇకపోతే  దుగరాజపట్నంపై ఆశలు చావని రాష్ట్ర ప్రజలకు కేంద్రం విస్పష్ట ప్రకటన నిరాశనే మిగిల్చింది.

 

 

అంతే కాకుండా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు తగిన నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న కేంద్రప్రభుత్వం చివరకు దుగరాజపట్నంపై కూడా చివరి ఆశలను కూడా తుంచేసింది. ఇక తొలినాళ్ళలో రామాయపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాగా చివరి క్షణంలో ఆ ప్రతిపాదన రద్దయింది. రామాయపట్నంకు బదులు నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2013 లో పచ్చజెండా ఊపింది. అయితే దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మాణం ఆర్ధికంగాను, సాంకేతికంగాను లాభదాయకం కాదని వివిధ సర్వే సంస్థలు తేల్చడంతో అక్కడ ఓడరేవు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది.

 

 

అయితే రాష్ట్రంలో కేంద్రం హామీ ఇచ్చిన దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణం సాధ్యం కాదని తేల్చిన పక్షంలో, బందరు ఓడరేవు నిర్మాణానికి ప్రాధాన్యం పెరిగింది. కేంద్రం చేపట్టే ఓడరేవు ఎక్కడ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.  కాని ఇప్పటికి ఆశ చావని వారు దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం జరిగితే దాదాపు 2 నుంచి 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, తద్వారా చదువుకున్న నిరుద్యోగులు బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందవచ్చని తెలిపారు.

 

 

అంతే కాకుండా దుగరాజపట్నంకు సమీపంలో ఉన్న నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు, కోట, వాకాడు, చిట్టమూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కమిషన్‌ వేసి పోర్టు పనులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు కూడా తయారుచేసి ఆకస్మాత్తుగా వెనక్కు తగ్గిందన్నారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుగరాజపట్నం పోర్టు నిర్మాణంపై దృష్టి సారించాలని ఇక్కడి ప్రజలు విన్నవించుకుంటున్న నేపధ్యంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న దుగ‌రాజ‌ప‌ట్నం ఓడ‌రేవుకు, ఈ సారైనా నిధుల కేటాయింపు ఉంటుందా అనే ఆలోచనలతో రాష్ట్రం ఎదురు చూస్తోంది. మ‌రి కేంద్ర బ‌డ్జెట్ ఏం చేస్తుందో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: