వసంత కృష్ణప్రసాద్...మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు తనయుడు. తండ్రి వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వసంత...మొదట్లో నానా కష్టాలు పడ్డారు. రాజకీయాల్లోకి రావడం రావడమే వసంత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. అయితే 1999 ఎన్నికల్లో నందిగామ నుంచి పోటీ చేసి దేవినేని ఉమాపై ఓడిపోయారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నేతగానే కొనసాగుతూ రాజకీయాలు చేశారు. ఇక రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా అయిపోవడంతో, 2014లో టీడీపీలో చేరారు.

 

కానీ 2019 ఎన్నికలకొచ్చేసరికి వసంతకి టికెట్ దొరుకుతుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. ఆఖరికి గుంటూరు సిటీలో టికెట్ ఇస్తామని టీడీపీ అధిష్టానం చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తన చిరకాల ప్రత్యర్ధి అయిన దేవినేని ఉమా టికెట్ రాకుండా ప్లాన్ చేస్తున్నారనే నేపథ్యంలో వైసీపీలోకి వస్తే మైలవరం టికెట్ ఇస్తామని హామీ దక్కడంతో టీడీపీని వీడారు. అనుకున్నట్లుగానే వైసీపీ తరుపున మైలవరం బరిలో నిలిచి..తన చిరకాల ప్రత్యర్ధి దేవినేని ఉమాని మట్టికరిపించి ఎమ్మెల్యే అయ్యారు.

 

ఎమ్మెల్యే అవ్వడమే వసంత దూకుడు ప్రదర్శించారు. టీడీపీని, దేవినేని ఉమాపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వచ్చారు. అటు అసెంబ్లీలో కూడా అప్పుడప్పుడు టీడీపీ విధానాలని ఎండగట్టారు. నియోజకవర్గంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాకపోతే గెలిచి 8 నెలలే అయింది కాబట్టి, మైలవరంలో పెద్ద మార్పు ఏమి రాలేదు. అయితే రాజధాని ఇష్యూ వసంతకు కష్టాలు తెచ్చిపెట్టాయని తెలుస్తోంది.

 

ఎందుకంటే ఎన్నికల్లో అమరావతిని మార్చే ప్రసక్తి లేదని రాజధాని ఇక్కడే ఉంటుందని వసంత ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు జగన్ మూడు రాజధానులు తీసుకు రావడం, అమరావతి ఒక రాజధానిగా ఉంటుందని చెప్పినా,  మైలవరం ప్రజలు కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలిసింది. పైగా మైలవరం అమరావతికి మరింత దగ్గరగా ఉండటంతో, ఆ ప్రాంత ప్రజలు ఎక్కువ శాతం అమరావతినే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే మూడు రాజధానులకు కూడా కొందరు మద్ధతు తెలుపుతున్నారు కూడా.  కాకపోతే మెజారిటీ అమరావతి వైపే ఉన్నారు. దీంతో  ఈ పరిణామం భవిష్యత్‌లో వసంతకు ఇబ్బంది కలిగించే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: