మరో రెండు రోజుల తరువాత ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా ఉన్నాయి. తమ తమ రాష్ట్రాలకు బడ్జెట్ లో ఏ మాత్రం కేటాయింపులు ఉండే అవకాశం ఉంది అనే విషయంపై ఆరా తీస్తున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా కేంద్ర బడ్జెట్ విషయంలో కేంద్రం ఏపీకి కేటాయింపులు ఏ విధంగా చేయబోతుందో అని ఆసక్తితో ఉంది. ఎందుకంటే కేదన్రా బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఆర్థిక మంత్రి ఏపీ కోడలు కావడం... ఆమె అత్తగారి ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం కావడంతో ఆ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు కు కేటాయింపులు ఏ విధంగా చేయబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది.

 

గత బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్ట్ కు బడ్జెట్ లో మొక్కుబడిగా కేటాయింపులు చేసింది. అప్పుడు అధికార పార్టీగా టీడీపీ ఉండడం, ఆ రెండు పార్టీల మధ్య వైరం ఉండడంతో కేటాయింపులు తక్కువగా జరిగాయని అంతా ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేటాయింపులు పెరుగుతాయని అంతా అంచనా వేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో పెద్ద ఎత్తున పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు బలంగా వచ్చాయి. దీనిపై కేంద్రం సీబీఐ విచారణ కూడా వేసేందుకు సిద్దపడగా ఏపీలోకి సీబీఐ రాకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది.

 

ఇక ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో కేంద్రం పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత గుర్తించి బడ్జెట్ లో కేటాయింపులు చేస్తే ఆ ప్రాజెక్ట్ త్వరిత గతిన పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించే అవకాశం ఏర్పడుతుంది. గత రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కుడి ఎడమ కాలువల నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పుడు బడ్జెట్ లో ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యాన్ని కేంద్రం గుర్తించి కేటాయింపులు ఎక్కువ చేపడితే దీని నిర్మాణం మరింత ఊపందుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ తెలుగింటి కోడలు బడ్జెట్ లో ఏ మేరకు కేటాయింపులు చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: