ఏ  ఆహార పదార్ధానికైనా రుచిని అందించేది ఉప్పు. అయితే ఉప్పుని పండించే రైతుల జీవితాలు మాత్రం చప్పగానే ఉండిపోతున్నాయి. ఎండనక.. వాననక ఎంతో కష్టపడి ఉప్పుని సాగు చేస్తే.. దళారుల దోపిడీతో ఉప్పు రైతు రోడ్డున పడ్డాడు. గిట్టుబాటు ధర రాకపోవడంతో.. ఇక తాము పండించలేమంటూ చేతులెత్తేస్తున్నారు.

 

మీ టూత్ పేస్టులో ఉప్పుందా..? అనే అడ్వర్‌టైజ్‌మెంట్ ఎంత ఫేమస్సో తెలియంది కాదు. అటువంటి ఉప్పు ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం చాలా వరకు తెలియదు. ఉప్పు ఎలా వస్తోందని పిల్లల్ని అడిగితే మల్టీ బ్రాండెడ్ పేర్లు చెబుతారు. కానీ, అది రైతు కష్టం నుంచి వస్తోందని డెబ్బై శాతం మందికి తెలియదు. అయోడైజ్డ్‌ సాల్ట్‌ అంటూ ఊదరగొట్టే అడ్వర్‌టైజ్‌మెంట్లే ఇందుకు కారణం. 

 

వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించుకున్న మల్టీబ్రాండెడ్ కంపెనీలు.. సముద్రంలో వచ్చే కల్లు ఉప్పును కూడా రాక్‌సాల్ట్ అంటూ జనాల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇలా కంపెనీలు ఎంత లాభపడుతున్నా.. అది పండించే రైతు మాత్రం నష్టాల్లోనే కూరుకుపోతున్నాడు.

 

నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతంలో ఐదు వేల ఎకరాల్లో ఉప్పు ఉత్పత్తి అవుతోంది. సుమారు 500 కుటుంబాలు ఉప్పు ఉత్పత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి మడుల్లో నీటిని ఉంచి.. వేసవికాలం వరకు సాగు చేసి ఉత్పత్తి చేస్తారు. అయితే, ఉప్పును నిల్వ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో.. వర్షాకాలం వచ్చేసరికి అమ్మేయాల్సిన పరిస్థితి రైతులది. దీన్నే ఆసరాగా చేసుకుంటున్నారు దళారులు. 

 

ఎకరా ఉప్పు సాగుకి 15 వేల వరకు రైతు ఖర్చు అవుతుండగా.. పెరిగిన కూలీలతో ఆ ఖర్చు మరింత ఎక్కువ అవుతోంది. అలా పండించిన ఉప్పుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా ఉండదు. దీని వల్ల బహిరంగ మార్కెట్లో 20 రూపాయలు ఉండే ఉప్పును.. దళారులు క్వింటా 70 రూపాయలకే అడుగుతున్నారు. దీంతో మద్దతు ధర లేక అల్లాడుతున్నాడు రైతు.

 

మరోవైపు.. వ్యాపారులకు, దళారులకు అడగగానే రుణమిచ్చే బ్యాంకులు.. ఉప్పు రైతుకు మాత్రం రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైన ప్రభుత్వం ఉప్పు రైతును గుర్తించి బోర్డు ఏర్పాటు చేయాలని.. ప్రతీ ఏడాది మద్దతు ధరను ప్రకటించాలంటున్నారు సింహపురి ఉప్పు రైతులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: